ప్రభుత్వ విద్యాసంస్థల్లో సావుకేక వినిపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్యం, యంత్రాంగం అలసత్వం.. పిల్లలను ప్రాణాలను బలిపెడుతున్నది. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చిన్నారుల మృత్యువాత, లేదంటే ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థత లాంటి వార్తలు వినిపిస్తూనే ఉండడం కలకలం రేపుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో చిన్నారులు చావు అంచుల దాకా వెళ్లి రావడం ఆందోళన కలిగిస్తున్నది.
తాజాగా మల్యాల వడ్డెరకాలనీలో ఇద్దరు వసతిగృహం పిల్లలు చెరువులో మునిగి చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సౌకర్యాల లేమి, పర్యవేక్షణలోపాన్ని మరోసారి బయటపెట్టగా.. ప్రభుత్వ తీరుపై వసతిగృహాలు, గురుకులాలు, పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. బడికెళ్లి, హాస్టల్ కెళ్లి ఫోన్ అచ్చిందంటే చాలు.. కాళ్లు చేతులు గజగజ వణికిపోతున్నాయని చెబుతున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం పంపామని, ఇలా చంపుకోవడం కోసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో మృత్యుఘోష ఆందోళన కలిగిస్తున్నది. సర్కారు నిర్లక్ష్యం, యంత్రాంగం పర్యవేక్షణ లోపమే అందుకు కారణమని తెలుస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఘనమైన చరిత్ర కలిగిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో రెండేళ్ల క్రితం విద్యార్థుల మృతి కలకలం రేపింది. 2024 జూలై, ఆగస్టులో వరుసగా ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు విద్యార్థులు వెంటిలేటర్ వరకు వెళ్లి రావడం సంచలనం సృష్టించింది.
2024 జూలై 26న 8వ తరగతి విద్యార్థి రాజారపు గణాదిత్యతోపాటు ఆడెపు గణేశ్, రాపర్తి హర్షవర్ధన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సిబ్బంది అప్పుడు పిల్లలను చాలా ఆలస్యంగా దవాఖానకు తరలించారు. గణాధిత్య చనిపోగా.. మిగిలిన ఇద్దరు విద్యార్థుల పరిస్థితి సైతం విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా, కొద్దిరోజులకు వారు కోలుకున్నారు. పాముకాటు వల్లే గణాధిత్య మృతి చెందాడని, ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు దాదాపు నిర్ధారించారు.
మరో పదిహేను రోజుల తర్వాత 6వ తరగతి విద్యార్థి ఎడుమల అనిరుద్పాటు మరో ఇద్దరు విద్యార్థులు హేమంత్ యాదవ్, మోక్షిత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని దవాఖానకు తరలించగా, అనిరుద్ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మిగిలిన విద్యార్థులు మెట్పల్లి, నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందిస్తే.. నెల రోజుల తర్వాత చావు అంచుల నుంచి బయటకు వచ్చారు. గత నెల 15న పెద్దపల్లి జిల్లాలోని లింగాపూర్ సమీపంలోని మోడల్ స్కూల్ల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ (13) వ్యవసాయ బావిలో పడి చనిపోయాడు.
సాయంత్రం పూట స్కూల్ ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా.. బాల్ ప్రహరీ అవతల ఉన్న వ్యవసాయ బావిలో పడింది. బాల్‌ను తీసేందుకు సాత్విక్‌తోపాటు మరో ముగ్గురు విద్యార్థులు కలిసి ఒకరినొకరు పట్టుకొని బావిలోకి దిగే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో సాత్విక్‌తోపాటు మరో విద్యార్థి బావిలో పడిపోయారు. స్వాతిక్ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతిచెందగా, మరో విద్యార్థిని దరిని పట్టుకొని బయటపడ్డాడు.
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు..
ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు చిన్నారులు మల్యాల మండలం వడ్డెర కాలనీలోని కొత్తకుంట చెరువులో మునిగి మృతిచెందడం మరోసారి సంచలనం సృష్టించింది. మూత్ర విసర్జన కోసమని మధ్యాహ్నం తర్వాత పాఠశాల నుంచి ఆరుబయటికి వెళ్లిన విద్యార్థులు సుశాంత్, విష్ణు చనిపోవడం అందరినీ కలిచివేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అధికారుల పట్టింపులేని తనానికి ఈ ఘటన నిదర్శనమన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మూత్రశాలలు ఎందుకు లేవని, పాఠశాలను, వసతిగృహాన్ని జనవాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో ఎలా ఏర్పాటు చేస్తారని, ప్రహరీ ఎందుకు నిర్మించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వడ్డెర కాలనీ పాఠశాల, వసతిగృహం రెండు ప్రమాదకరమైన స్థలంలో ఉంటాయని, వాస్తవానికి అక్కడ చిన్నారులను ఉంచడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.
ఫుడ్ పాయిజన్ కేసులకు లెక్కేలేదు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోయిన సంఘటనలే కాదు, ఫుడ్ పాయిజన్ కేసులకైతే లెక్కేలేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకసార్లు గురుకులాలతోపాటు బీసీ,ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో ఉండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడి దవాఖానల పాలయ్యారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ విద్యార్థినులు గతేడాది ఫుడ్ పాయిజన్‌కు గురి కావడంతోపాటు పలువురు విద్యార్థినులను చికిత్స కోసం జగిత్యాలకు తరలించాల్సి వచ్చింది. అలాగే ధర్మపురిలోని రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు సైతం ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించాల్సి వచ్చింది. గొల్లపల్లిలో నిర్వహిస్తున్న పెగడపల్లికి చెందిన బీసీ గురుకులంలో 15 మంది టెన్త్, ఇంటర్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థత చెందారు.
జగిత్యాలలోని వసతిగృహంపై బట్టలు ఆరవేసుకుంటున్న ఒక బాలుడు అక్కడే కూలిపోవడం, ఒళ్లంత మాడిపోవడం ఆందోళన కలిగించింది. చావు బతుకుల మధ్య ఉన్న ఆ బాలుడిని హైదరాబాద్ తరలించి చికిత్స అందించగా, నెల తర్వాత కోలుకున్నాడు. అయితే హఠాత్తుగా కాలిపోవడానికి కారణం ఏంటి? అన్నదానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస విచారణ చేయించకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ఇలా ఒకటా రెండా.. పదుల సంఖ్యలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురికావడం, తీవ్ర అస్వస్థతకు లోనుకావడం, వారిని జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించి చికిత్సలు చేయించడం సర్వసాధారణమైంది.
పట్టింపులేనితనం వల్లే
ప్రభుత్వం పట్టింపులేని తనం.. ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి, విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యపూరిత వ్యవహారం వల్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దాపూర్ గురుకులం, అలాగే మల్యాల వడ్డెర కాలనీ వసతిగృహం, పాఠశాలలు రెండు జనసంచారానికి దూరంగా ఉన్నాయి. లింగాపూర్ సమీపంలోని మోడల్ స్కూల్ కూడా అలాగే ఉన్నది. ఈ మూడు చోట్ల భవనాల పక్కన చిట్టడవిని తలపించేలా ఉంటాయి. సమీపంలోనే ప్రమాదకరమైన బావులు, చెరువులు ఉన్నాయి. ఇన్ని నెగెటివ్ అంశాలు ఉన్నచోట విద్యా సంస్థలను నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఈ మూడు చోట్లా జాగ్రత్తలు తీసుకున్న పాపాన పోలేదు. దీంతోనే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలు పట్టని అధికారులు
పెద్దాపూర్ గురుకులంలో ఇద్దరు మృతిచెందడం, ఆరుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్ కావడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలోనే 2024 ఆగస్టు 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వసతిగృహాన్ని సందర్శించి, పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. దాదాపు ఐదు గంటలపాటు లక్కడే గడిపారు. భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాలయం, వసతిగృహం ఆవరణలో పిచ్చిమొక్కల తొలగింపు, చెత్తశుద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి విద్యార్థికి హెల్త్‌కార్డు జారీ చేస్తామని, పక్షం లేదా నెలకు ఒక్కసారి గురుకులంలో ప్రభుత్వ వైద్యులు మెడికల్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తారన్నారు.
రాష్ట్ర మంత్రులతోపాటు విప్‌లు ప్రతి నెలా తమ పరిధిలో ఉన్న ఏదో ఒక గురుకులానికి వెళ్లి, పిల్లలతో కలిసి అల్పాహారం, భోజనం చేయాలని, సమావేశం కావాలని కోరారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఇతర అధికారులు తమ పరిధిలో ఉన్న ఏదో వసతిగృహం లేదా గురుకులానికి వెళ్లి రాత్రిపూట బస చేయాలని సూచించారు. పదిపదిహేను రోజులకు ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ జీవో వచ్చి రెండేళ్లయినా అమలులో మాత్రం చిత్తశుద్ధి కరువైంది. అప్పుడప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు వసతిగృహాలకు వెళ్లి పిల్లలతో మధ్యాహ్న భోజనం చేయడమే తప్పా రాత్రిపూట బస చేసింది లేదు. నెలలో ఏదో ఒక్క ఏదో ఒక గురుకులాన్ని లేదా వసతిగృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి బస చేస్తే సిబ్బంది భయం, బాధ్యత మరింత పెరగడంతోపాటు తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఎక్కడా పట్టించుకునే వారు కరువయ్యారు.