సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కోసం వెతికేవారికి సంబంధించిన బయోడేటాలను లక్ష్యంగా చేసుకొని ఈ మోసాలు చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించి అనధికారిక సోషల్‌మీడియా ప్రకటనలు, జాబ్‌పోర్టల్స్ వెబ్సైట్లలో నిరుద్యోగులు తమ బయోడేటాలను అప్లోడ్ చేస్తుండటంతో.. సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది.
బయోడేటాలోని మొబైల్ నంబర్లకు కాల్చేసి ఉద్యోగాల పేరుతో అందినకాడికి దోచేస్తున్నారు. మేము ఫలాన కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని.. మీకు తగిన జాబ్ మా దగ్గర ఉందని చెప్పి ఫోన్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో, బ్యాక్‌డోర్ విధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులను డబ్బులు కట్టించుకొని.. ఆతర్వాత మొబైల్ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో వేయడం, స్విచ్ఆఫ్ చేయడం వంటివి చేస్తున్నారు. కొన్ని అధికారిక జాబ్ పోర్టళ్ల నుంచి కూడా డేటా లీక్ అవుతందనే విమర్శలూ లేకపోలేదు.
సోషల్‌మీడియా ప్రకటనలతో..
ప్రస్తుత కాలంలో సోషల్‌మీడియాలో యువత ఎక్కువ సమయం గడుపుతున్నా రు. ఇదే అదునుగా సోషల్‌మీడియా వేదికగా సైబర్ నేరగాళ్ల ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. మంచి కంపెనీలో ఉద్యోగం కావా లనుకుంటున్నారా? మీకు ఉద్యోగం కావాలంటే ఈ ఫోన్ నంబర్‌కు కాంటాక్ట్ట్ చేయండి.. ఈ లింక్‌ను క్లిక్ చేయడంటూ ప్రకటన లు ఇస్తుంటారు. ఇందులో కొన్ని సందర్భాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఔ) సేవలను కూడా నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. స్థానికంగా ఉద్యోగాలతో పాటు పొరుగు రాష్ర్టాలు, ఇతర దేశాలలోనూ ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మిస్తుంటారు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ తక్కువ మొత్తంలో వసూలు చేసి.. అనంతరం నకిలీ ఇంటర్వ్యూ లు, నకిలీ ఆఫర్ లెటర్లు పంపిస్తూ బాధితుల వద్ద నుంచి అందినకాడికి దోచేస్తున్నారు.
డబ్బుల ప్రస్తావన వస్తే మోసమే…!
ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బులు అడిగారంటే అది మోసమని గుర్తించాలని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. డేటా అనేది పోర్టల్స్ నుంచే కాకుండా, పలు చోట్ల ఉద్యోగాల కోసం ఇంటర్నెట్ నుంచి దరఖాస్తు చేస్తున్న సందర్భాలలో సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశముంటుందంటున్నారు. జాబ్ పోర్టల్స్ వారు కేవలం ఉద్యోగం ఉందని సమాచారం ఇస్తారు.. డబ్బులు అడగరనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగం విషయంలో ఎక్కడైనా డబ్బు ప్రస్తావన వచ్చిందంటే అక్కడ ఏదో మోసముందని అనుమానించాల్సిన అవసరముంటుంది. అయితే డబ్బులు అడిగేవారు బ్యాక్‌డోర్ ఉద్యోగాలంటూ మభ్యపెట్టే అవకాశాలుంటాయని, ఎవరు కూడా బ్యాక్‌డోర్ ఉద్యోగాలు ఇవ్వరనే విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలు నమోదుచేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.