Fellowship Scam | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 8: ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన కొందరు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయకుండానే లక్షలాది రూపాయల ఫెలోషిప్ నిధులను స్వాహా చేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఈ అక్రమ దందా పతాకస్థాయికి చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో పరిశోధకులకు తాము చేసే పీహెచ్డీ, పీడీఎఫ్ స్థాయి పరిశోధన ఆర్థికభారంగా మారవద్దనే లక్ష్యంతో యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సంస్థలు ఇస్తున్న ఫెలోషిప్‌లు పక్కదారి పడుతున్నాయి.
ప్రతి ఏటా వందలాది మంది ఈ ఫెలోషిప్‌కు ఎంపికవుతున్నప్పటికీ, కేవలం పదుల సంఖ్యలోనే తమ పరిశోధనను పూర్తి చేస్తున్నారు. ఇవి పొందేవారు ఎలాంటి ఉద్యోగం చేయవద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు మరో ఉద్యోగం చేస్తూ రెండు రకాల ఆదాయం పొందుతున్నారు. మరికొందరు రీసెర్చ్ మీద ఖర్చుచేయకుండా ఫెలోషిప్ డబ్బులను ప్లాట్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కేయూలో వెలుగులోకి..
ఓ వైపు ఫెలోషిప్‌లు క్లెయిమ్ చేస్తూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం చేసిన ఇద్దరు పరిశోధకుల వ్యవహారం ఇటీవల కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలోవెలుగు చూసింది. కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్య పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్(పీడీఎఫ్) తీసుకుంటూనే పార్ట్‌టైం, కాంట్రాక్ట్ లెక్చరర్‌గా జీతం తీసుకున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ తీసుకుంటూ ఇతర ఉద్యోగం చేయడానికి వీలు లేదు కానీ శంకరయ్య లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే ఫెలోషిప్, కాంటిజెన్సీ, హెచ్ఎస్ఏ కలిపి రూ.6,89,400 డ్రా చేశారు. అదే సమయంలో పార్ట్‌టైం, కాంట్రాక్ట్ లెక్చరర్ రూ.2,32,145 వరకు డ్రా చేశారు. గుట్టుగా సాగిన ఈ వ్యవహారం కొన్నాళ్ల క్రితం వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు అందాయి.
తేల్చిన కమిటీ.. చర్యల్లో జాప్యం..
కెమిస్ట్రీ ప్రొఫెసర్ హనుమంతు ఛైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. విచారణలో శంకరయ్య రూ.6,89,400 ఫెలోషిప్‌ను అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఆ మొత్తాన్ని తిరిగి యూజీసీకి చెల్లించాలని, అలాగే ఇటు యూనివర్సిటీని అటు యూజీసీని చీట్ చేసిన శంకరయ్యను టర్మినేట్ చేయాలని ఐదు నెలల క్రితమే సిఫార్సు చేసింది. శంకరయ్య వివిధ మార్గాల ద్వారా యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఒత్తిడి పెంచడంతో నెల రోజుల క్రితం రిపోర్టును ఎంక్వైరీ కమిటీ రివ్యూ చేయాలని మరోసారి కమిటీకి పంపారు. కానీ సభ్యులు యూజీసీకి చెల్లించాల్సిన అమౌంట్ తగ్గించలేమని, అది తమ పరిధి కాదని పాత సిఫార్సులకే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు సమాచారం. రూ.6,89,400 శంకరయ్య ఇప్పటివరకు చెల్లించపోయినా కేయూ వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్ డాక్టర్ రణధీర్‌రెడ్డి కాలేజీ నిధులు రూ.8.50 లక్షలను సొంతానికి వాడుకుని, కొన్నాళ్లకు తిరిగి జమ చేశారు. విషయం బయటపడటంతో కొద్దిరోజుల్లోనే సదరు ప్రిన్సిపాల్‌కు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా టర్మినేట్ చేశారు. కానీ శంకరయ్య విషయంలో ఏడు నెలలయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
గతంలో ఇదే తెలుగు విభాగంలో డాక్టర్ ఈదుల చంద్రమౌళి అనే వ్యక్తి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ తీసుకుంటూ తెలుగు అకాడమీలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నట్లు యూనివర్సిటీ గుర్తించింది. దీంతో ఫెలోషిప్ అమౌంట్ రికవరీ చేయాలని యూనివర్సిటీని యూజీసీ ఆదేశించి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు రికవరీ చేయలేదు. ఇద్దరు కూడా తమకు సూపర్వైజర్గా ఉన్న ప్రొఫెసర్లకే తెలిసే ఈ మోసాలకు పాల్పడటంతో వారి పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీసీ, రిజిస్ట్రార్‌కు అల్టీమేటం..!
‘తీగ లాగితే డొంక కదలినట్లు’ ఉంది కాకతీయ యూనివర్సిటీ ఫెలోషిప్ వ్యవహారం. ఫెలోషిప్ అక్రమాల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తనపై చర్యలు తీసుకుంటే అక్రమాలకు పాల్పడిన మరో 20 మందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే శంకరయ్య వీసీ, రిజిస్ట్రార్‌కు అల్టీమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. కాకతీయ యూనివర్సిటీలో అధికారులు ఇచ్చే నోటీసులంటే కొందరికి లెక్కలేకుండాపోతుంది. యూనివర్సిటీ నోటీసులా అయితే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమంగా డ్రా చేసిన యూజీసీ ఫెలోషిప్ నిధులు
రూ.6,89,400 తిరిగి చెల్లించాలని శంకరయ్యకు రిజిస్ట్రార్ నోటీసుల మీద నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నెలరోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. శంకరయ్యను యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీ వెనకేసుకేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం..
ఫెలోషిప్ వ్యవహారంతో కాకతీయ యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం ఉంది. అన్ని యూనివర్సిటీల్లో లోతుగా ఎంక్వైరీ చేస్తే ఇలాంటివాళ్ల బండారం బయటపడే అవకాశమున్నదనే చర్చ జరుగుతున్నది. ఇలాంటివారు లక్షల్లో ఫెలోషిప్ తీసుకుంటూ పరిశోధనలను పూర్తి చేయకుండా యూజీసీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కు ఫైనల్ రిపోర్ట్ కూడా అందజేయడంలేదు. పరిశోధన సంస్థల లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో అక్రమాలు జరిగిన యూనివర్సిటీలను యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సంస్థలు ఫెలోషిప్‌లు ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం లేకపోలేదని పలువురు ప్రొఫెసర్లు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యా కమిషనర్, యూజీసీ ఛైర్మన్‌కు ఫిర్యాదు సిద్ధం..
గతంలో రణధీర్‌రెడ్డి, శ్రీనివాస్‌లపై తీసుకున్న నిర్ణయాలను అమలు పరచాలని విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యంతో విసుగెత్తిన ఫిర్యాదుదారులు రాష్ర్ట విద్యాకమిషనర్ యోగితా రాణా, యూజీసీ ఛైర్మన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే యూజీసీ విచారణ చేస్తే విస్తుబోయే నిజాలు బయటపడే అవకాశం ఉందని.. దీంతో యూజీసీ కాకతీయ యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం ఉంది. అదే జరిగితే యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులకు, రూసా ఫండ్స్, ప్రాజెక్టులు ఆగిపోవడమే కాకుండా యూనివర్సిటీ రిపిటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కనుక మంథని శంకరయ్యపై కమిటీ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకొని యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలని వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రంని ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులు, పరిశోధకులు కోరుతున్నారు.
20 మంది పేర్లు బయటపెడతానంటున్నాడు : ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం, కాకతీయ యూనివర్సిటీ

రిజిస్ట్రార్ (04బీ)కాకతీయ యూనివర్సిటీలో ఫెలోషిప్ పేరిట చాలా మంది అక్రమాలకు పాల్పడ్డారు. కమిటీ విచారణలో తెలుగు విభాగం కాంట్రాక్టు లెక్చరర్ మంథని శంకరయ్య అక్రమాలు వెలుగు చూడటంతో తనలాగే మరో 20 మంది యూనివర్సిటీలో ఉన్నారని, వాళ్ల పేర్లు బయటపెడతానంటున్నాడు. పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. ఎంక్వైరీలోనూ అదే తేలింది. మిగతా వాళ్లపై కూడా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.