ఖిలావరంగల్, మార్చి 23 : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ కు చెందిన ఎండీ సమద్ (75) రైతు తనతో పాటు మరో 40 మందికి సంబంధించిన భూమి సమస్యపై కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు. 2019 సంవత్సరం నుండి తమ భూమిపై వివాదం కొనసాగుతోందని తెలిపారు. ఆగస్టు 4,2025 నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. పూర్వీకుల కాలం నుంచి సుమారు 75 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఇప్పటికే ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు ఆశ్రయించినప్పటికి సమస్యకు పరిష్కారం లభించలేదని తెలిపారు. సంబంధిత అధికారులు తమ వద్ద ఉన్న భూమి పత్రాలను పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపించి తమ హక్కులను పరిరక్షించాలని కోరుతూ వినతిపత్రం ప్రతులను సంబంధిత అధికారులకు కూడా అందజేశారు. జిల్లా అధికారులు స్పందించి భూమి వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.