స్టేషన్ ఘన్పూర్ జూన్ 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం రైతు సమస్యలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు పరుచాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ వెంకటేశ్వర్లుకు అందించారు.
ఈ సందర్భంగా రాపర్తి సోమయ్య మాట్లాడుతూ దేశంలో రైతంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు రుణ విమోచన చట్టం తేవాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధులు సంవత్సరానికి 10వేలు పెంచాలని, విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ ప్రైవేట్ మార్కెట్ ముసాయిదా వెనక్కి తీసుకోవాలన్నారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకొని, 2014 నుండి రైతులు తీసుకున్న వారికి రుణమాఫీ రెండు లక్షలు వెంటనే మాఫీ చేయాలని వారు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి, నాయకులు మంద మొగిలి, మంద రాజు, తొడంగల మల్లయ్య, వంగపల్లి సోమన్న, వారాల లింగయ్య, నీరటి నాగరాజు, గట్టయ్య, రాజు, రాములు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.