తొర్రూరు, మే 30: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు రైతులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా ధాన్యం కాంటాలు కాకపోవడం గురించి నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్త వెలువడిన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి శుక్రవారం అమ్మాపురం, మాటేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమ్మపురం గ్రామానికి చెందిన మహిళా రైతు గుంటుక సోమలక్ష్మి మాట్లాడుతూ.. “మాకు యాసంగి బోనస్ డబ్బులు బ్యాంకులోకి పడడం లేదు, ఎందుకు రావడం లేదో చెప్పండి” అని అడిగినప్పటికీ ఆమె ప్రశ్నకు ఏ మాత్రం స్పందించకుండా అదనపు కలెక్టర్ కారెక్కి అక్కడి నుండి వెళ్లిపోయారు.
అదేవిధంగా రైతులు పేర్కొంటూ, “ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జీలు, కొంతమంది అధికారులు కలిసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులను ఏదైనా ప్రశ్నిస్తే, వారి ధాన్యాన్ని కాంటాలు పెట్టకుండా ఆలస్యం చేస్తున్నారు,” అని వాపోతున్నారు. అయితే అధికారులు ఈ విషయంపై మౌనం పాటించడం రైతుల ఆవేదనను మరింత పెంచుతోంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మాట్లాడుతూ, “జిల్లాలో ఇప్పటివరకు 1,74,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలిస్తాం,” అని తెలిపారు.
అమ్మపురం కేంద్రంలో ఇంకా 5,000 బస్తాలు కాంటాలు కాకుండా ఉన్నాయని,5000 బస్తాలు తరళించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేగాక, జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, మిగిలిన 5–10 శాతం ధాన్యాన్ని త్వరలో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా తొర్రూరు పిఎసిఎస్ సిబ్బందిపై వెలువడిన అక్రమ వసూళ్ల మీద కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరాఫరల అధికారి ప్రేమ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ కృష్ణవేణి,డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, తహసిల్దార్ శ్రీనివాస్, ఏవో రాంనర్సయ్య, ఆర్ఐ బషీర్, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు,తదితరులు పాల్గొన్నారు.