వరంగల్: కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వడ్ల కల్లాల్లోనే ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లానెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో గాజుల పెద్ద వెంకటేశ్వర్లు అనే రైతు ధాన్యం మార్కెట్లో హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. రైతు వెంకటేశ్వర్లు వరి, మొక్కజొన్న సాగుడు చేశాడు.
పంటలు చేతకొచ్చాక అమ్మేందుకు మార్కెట్కు తరలించాడు. మార్కెట్ ఇబ్బందుల దృష్ట్యా మొక్క జొన్నలను కాపుల కనపర్తిలో 15 రోజుల క్రితం తరలించాగా వడ్లు మాత్రం అలంకానిపేటలో మార్కెట్కు తరలించాడు. ఆదివారం మార్కెట్లోనే గుండెపోటుతో కుప్పకూలాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత నెల రోజుల నుంచి పండించిన పంటలు కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన చెంది గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులు, తోటి రైతులు ఆరోపించారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.