హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 12వ తేదీన హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘సిల్వర్ జూబ్లీ పాటల పోరాటం’ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థిలోకం పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘నా పేరే ఏపూరి -పోరాటమే నా దారి’ అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలో కవులకు, కళాకారులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి, వారి పక్షాన నిలబడి ఎదిరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. పస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో యువత పెడదోవ పడుతూ మాదకద్రవ్యాలు(డ్రగ్స్) బారిన పడుతుండటంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతను జాగృతం చేసి సరైన మార్గంలో నడిపించేందుకు అక్టోబర్ నెల నుంచి తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా పర్యటనలు, చైతన్య కార్యక్రమాలు చేపడతానని సోమన్న వెల్లడించారు.