హనుమకొండ చౌరస్తా, మార్చి 25: ఇటీవల రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో రాష్ర్ట హైకోర్టు ఇచ్చిన తీర్పును రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్వీనర్ శ్రీదర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండ జడ్పీలోని పీఆర్టీయూ భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావలసిన బెనిఫిట్స్ విడుదల చేయాలని ప్రభుత్వం చుట్టూ,అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడం వలన కొంతమంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు 9 వారాల్లోగా చెల్లించాలని తీర్పు ఇవ్వగా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టడం, వాయిదాలు వేయడంతో 660 మంది కంటెంట్ వేశారన్నారు.
హైకోర్టు జడ్జి, ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ సుల్తానియని స్వయంగా కోర్టుకు హాజరుకావాలని కోరడంతో ఏప్రిల్ 9లోగా చెల్లిస్తామని కోర్టుకు విన్నవించారు. హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు కేవలం ఒక ఆదేశం మాత్రమే కాదు, వేలాది మంది విశ్రాంతి ఉద్యోగుల పాలిట ఒక ఆశల ఆయుధమని ఏప్రిల్ 9వ తేదీని తుది గడువుగా విధిస్తూ ఆలోగా పెండింగ్లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెన్ఫిట్స్ చెల్లించాలని స్పష్టం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ తన నైతిక బాధ్యతను చాటుకున్నదన్నారు. సమావేశంలో కందకూరి దేవదాసు, ఎండీ.అబ్దుల్ గఫార్, మేకిరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, సూర కుమారస్వామి, సారయ్య, విశ్వనాథం పాల్గొన్నారు.