భీమదేవరపల్లి, జనవరి 14: వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భోగి పండుగ కావడంతో హనుమకొండ జిల్లా కొత్తకొండలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చాలని స్వామివారికి కోర మీసాలు సమర్పించారు. ఆలయ ప్రదక్షిణలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలోని దుకాణ సముదాయాలన్నీ రద్దీగా మారాయి. ఆలయ స్వాగతం వద్ద గల త్రిశూల చౌరస్తా అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. భక్తులు, యువత సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఘనంగా కుమ్మరి బోనం..
కడిపికొండ, ఉల్లిగడ్డ దామెరకు చెందిన కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజున ఆలయ సమీపంలో కుమ్మరి (వీర) బోనం చేశారు. ఎడ్ల బండ్లను రథాలుగా అందంగా తీర్చిదిద్దారు. కుమ్మరి బోనం నెత్తిన పెట్టుకోగా, డప్పు చప్పుల్ల మధ్య శివసత్తులు నృత్యాలు చేశారు. వీరశైవులు ఖడ్గాలు వేశారు. కుమ్మరి బోనం నెత్తిన పెట్టుకొని ఆలయానికి వస్తుండగా.. వెనుక ఎడ్లబండ్ల రథాలు, శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుల్ల ను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనంతో వెళ్లిన కుమ్మరి వంశస్థులు ఆలయం చెట్టు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
సూర్య యంత్ర స్థాపన..
భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సర్వంగాభిషేకం నిర్వహించారు. భద్రకాళి అమ్మవారికి శ్రీ చక్ర నవావరణ పూజ జరిపించారు. సూర్య యంత్రాన్ని స్థాపించి అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు గావించారు. భక్తులకు సమస్త బాధలు, రోగాలు తొలగి ఆయురారోగ్యాలు కలగాలని యాగశాలలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ రామాల సునీత, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.