డోర్నకల్, సెప్టెంబర్ 01 : అమెరికా దేశ పెట్టుబడిదారి ఆగడాలు భారతదేశంలో రోజురోజు అధికమవు తున్నాయని, ఫలితంగా భారతదేశ కార్మికులు ముఖ్యంగా రైతులు తీవ్ర నష్టాలు చవిచూడవలసి వస్తుందని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సిఐటియు కార్యదర్శి దాసరి మల్లేశం విమర్శించారు. సోమవారం డోర్నకల్ సుభాష్ వీధి లోని కార్మికుల అడ్డా వద్ద ఆయన భవన నిర్మాణ మరి ఇతర కార్మికుల ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలో బడా పెట్టుబడిదారీ దేశంగా చలామణి అవుతున్న అమెరికా భారతదేశంపై వాణిజ్య సుంకాలను 50 శాతం పెంచడం మూలంగా మన దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయన్నారు.
మెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల పైన భారతదేశం విధించే 11 శాతం వాణిజ్య సుంకాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారేమో 50% దిగుమతి సుంకాలను విధిస్తుంటే, మన దేశం అమెరికా వస్తువులకు విధించే ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు విధించే దిగుబడి సంఖం 11 శాతాన్ని పూర్తిగా రద్దు చేయడం మూలంగా దేశీ రైతులు నష్టపోతున్నారని, ఫలితంగా వారు పంటలపై పెట్టిన పెట్టుబడులు కూడా పంటలు విక్రయిస్తే లభించనందున తీవ్ర నష్టాలకు గురవుతున్నారని మల్లేశం పేర్కొన్నారు.
ఈ విధంగా దేశీయ రైతులకు నష్టం కలగజేసే అమెరికా వాణిజ్య సుంకాల విధానాన్ని తిప్పి కొట్టాలంటే, వారి వస్తువులను ముఖ్యంగా వ్యవసాయ వస్తువులు పత్తి తదితరాలను బహిష్కరించాలన్నారు. లేదా అమెరికా వస్తువులపై భారత్ దిగుమతి సుంకాలు ఎక్కువగా పెంచాలని అప్పుడే భారతీయ రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం మేస్త్రీలు బడేటి సైదులు, ఎం సునీల్, సీతారాం, బావ్ సింగ్, బి.పునయ్య, బి వెంకటేశ్వర్లు, వెంకట్ నారాయణ, ఎస్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.