హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: గ్రేటర్ వరంగల్ పరిధిలోనీ ప్రజాసమస్యలను పరిష్కరించకుండా ప్రజలను విస్మరిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొట్ల చక్రపాణి ఆరోపించారు. సీపీఎం నార్త్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల కోసం అధ్యయన యాత్ర నిర్వహించారు. ఈ అధ్యయన యాత్రలు సోమవారం నుండి 13 వరకు అన్ని డివిజన్లలో ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐదో డివిజన్ పరిధిలోని దాసరివాడలో డ్రైనేజీ తీయకుండా చెత్త పేరుకు పోయిందని ఫలితంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని ప్రజలు అనారోగ్య పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రోడ్లుసరిగా లేవని, వర్షం వస్తే చెరువులను తలపించేలాగా మారుతున్నాయని, కుక్కలు బెడద విపరీతంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పేదల నివసించే కాలనీలు అభివృద్ధి చేయాలని లేకపోతే రాబోయే రోజులలో పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని చక్రపాణి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఏరియా కమిటీ కార్యదర్శి గాదె రమేష్, ఏరియా నాయకులు మంద మల్లేశం, ఇంజపల్లి రాజు, ఒంటెల పాపయ్య పాల్గొన్నారు.