Hyena Attack | ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం రాత్రి కట్టేసి ఉన్న పశువులపై హైనా దాడి చేసింది. ఈ దాడిలో ఆవు చనిపోగా, మరో రెండు ఆవులకు గాయలాయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గర్మిళ్లపల్లి గ్రామ వాపి చార్ల నారాయణ అనే రైతు తన ఆవును శుక్రవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం నారాయణ కుమారుడు ఆజయ్ కుమార్ బావి దగ్గరకు చేరుకునే చూసేసరికి ఆవు కింద పడి పోయిన సంగతి గమనించారు. ఆవు దగ్గరికి వెళ్లి చూసి ఏదో జంతువు చంపినట్టు గుర్తించి చుట్టు పక్కల రైతులకు చూపారు. దీంతో చార్ల నారాయణ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచామిచ్చారు. ఏదో క్రూరమైన జంతువు చంపిందనే వార్త దావానంలా వ్యాపించడంతో స్థానిక రైతులు, ప్రజలు భయాందోళన చెందారు.
అటవీశాఖ బీట్ ఆఫీసర్ బీ బాలరామ కృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని ఆవును చంపిన జంతువు పాదముద్రలను పరిశీలించి, ఆ ఆవును చంపి తిన్నది హైనా అని నిర్ధారించారు. ఇదే గ్రామ వాసి బాలబోయిన లింగయ్యకు చెందిన రెండు ఆవుల పైన కూడా దాడి చేయగా అందులో ఒక ఆవు పరిస్థితి విషమంగా మారింది. చార్ల నారాయణ ఆవు మృత్యువాత పడడంతో సుమారుగా రూ.30 వేల వరకు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ బీట్ ఆఫీసర్ బాలరామకృష్ణ మాట్లాడుతూ.. రైతు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులను ఇండ్లలో కట్టేసుకోవాలన్నారు. రాత్రి పూట రైతు బావుల దగ్గరికి ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.