హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 9 : కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1270 మంది కాంట్రాక్ట అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తర్వాతనే యూనివర్సిటీలలో కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని కమిటీ డిమాండ్ చేసింది. అదేవిధంగా ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా మండలి కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న అనేకమంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రాసెసర్స్ను బుధవారం తెల్లవారుజామున నుండి 40 మందికి పైగా అధ్యాపకులను అక్రమంగా అరెస్టు చేసి వారి కుటుంబాలను తీవ్ర మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ చర్యలను కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా యూనివర్సిటీలలో యూనివర్సిటీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు తమ న్యాయమైన డిమాండ్ ను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగానే అమలు చేయమని కోరితే ప్రజా పాలనలో అది నేరంగా మారుతుందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అరెస్టు చేసిన అధ్యాపకులను తక్షిణమే విడుదల చేయాలని కేయూ కాంట్రాక్టు కోఆర్డినేషన్ కమిటీ నేతలు సాదు రాజేష్, మాదాసి కనకయ్య, బి సతీష్ డిమాండ్ చేశారు.