హనుమకొండ చౌరస్తా : భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదివాసి సమూహాల హక్కులను హరించేలా జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి వెంటనే శాంతి చర్చలకు ముందుకు రావాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి కే గోవర్ధన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించడానికి ఈ నెల 25న వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్హాల్లో న్యూడెమోక్రసీ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శనివారం ప్రెస్ క్లబ్లో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. మధ్య భారతం ఏజెన్సీ ప్రాంతాల్లో నిక్షిప్తమైన అత్యంత విలువైన ఖనిజ సంపదను అదాని, అంబానీ వంటి స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానంలో భాగంగానే ఈ ఆపరేషన్ కగార్ ప్రక్రియ కొనసాగుతుందని గోవర్ధన్ ఆరోపించారు. ఈ చర్య దేశ పౌరులకు భారత రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు, వాక్ స్వాతంత్య్రపు హక్కుకు విరుద్ధమని గోవర్ధన్ అన్నారు.
కార్యక్రమంలో ఇఫ్టూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, పార్టీ నాయకులు సూర్యం, ఏ రాజేందర్, గంగుల దయాకర్, ఆర్ బాలరాజు, మానవహక్కుల వేదిక నాయకులు బండి కోటేశ్వర్, ఎండీ ఖాన్, హరిబాబు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పాల్గొన్నారు.