బచ్చన్నపేట, మార్చి 6 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్ర పరిధిలో గల కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గల కిచెన్‌ను సందర్శించి.. కూరగాయలు తాజాగా ఉన్నాయా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వంట సరుకుల నాణ్యతను, గుడ్లను నీటిలో వేసి వాటి నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పాఠశాలను ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు గురించి ఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యార్థులతో మాట్లాడి ఉదయం అల్పాహారం ఏం పెట్టారు? ఎలా ఉంది? అని ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ గీత, ఉపాధ్యాయులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
