హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 23 : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన సీఎం కప్ రాష్ర్టస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్స్‌గా పురుషుల్లో ఖమ్మం జిల్లా మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నిలిచాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్రస్థాయి పోటీలు సోమవారం జేఎన్ఎస్లో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమైన హనుమకొండ జిల్లాను స్పోర్ట్స్‌హబ్‌గా మార్చనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సీఎం కప్ నిర్వహించినట్లు, రాష్ర్టంలోని అన్ని జిల్లాలలోని క్రీడాకారులు హనుమకొండ విచ్చేసి తమ ప్రతిభను ప్రదర్శించడం సంతోషదాయకమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజిజ్ఖాన్ మాట్లాడుతూ క్రీడాకారులు తమ నైపుణ్యాలు ప్రదర్శించేందుకు సీఎం కప్ చక్కటి వేదికని, ప్రణాళికబద్ధమైన శిక్షణకు అంకితభావం క్రమశిక్షణ తోడైతే విజయాలు సొంతమవు తాయన్నారు. జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ మాట్లాడుతూ 33 జిల్లాల నుంచి 1600 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.
నెలరోజులుగా గ్రామస్థాయి మొదలు రాష్ర్టస్థాయి వరకు సీఎంకప్ పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం అతిథులు క్రీడాకారులకు జ్ఞాపికలు, విజేతలకు మెడల్స్ ప్రధానం చేసి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, నిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు గట్టు మహేష్, కరీం, రాజేందర్, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.
