వరంగల్ చౌరస్తా : ఫిబ్రవరి 26 న ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళానికి రావాలని ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి కేటీఆర్‌ను ఆహ్వానించారు. సోమవారం ఏనుగుల రాకేష్ రెడ్డి హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతిసంవత్సరం ఓరుగల్లు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తామని, ఈ సారి వేడుకలకు తప్పక హాజరవ్వాలని కోరారు.
అందుకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్ తప్పనిసరిగా హాజరవుతానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. గత వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు, తనికెళ్ల భరణి, గంగాధర శాస్త్రి, శశిధర్ శర్మ, జేడీ లక్ష్మినారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారని గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్, ఇస్కాన్ ప్రచారకులు స్వామిజీ ప్రణవానంద దాస్, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, దేశపతి శ్రీనివాస్, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య లాంటి వారు వస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు.