భీమదేవరపల్లి, ఏప్రిల్ 21: బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలకు సమయం దగ్గరపడుతున్నది. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ మహాసభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరూవాడా తిరుగుతూ ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు వాల్ పాస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండల సురేందర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున రజతోత్సవ మహాసభకు తరలి రావాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తుందని, కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తుచేశారు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. మండలం నుంచి 15 వేల మందికిపైగా మహాసభకు రానున్నట్లు చెప్పారు.ఈ మహాసభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యావంతులు, మేధావులు, కెసిఆర్ అభిమానులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగ రవి, నాయకులు మాడిశెట్టి కుమారస్వామి, అప్పని బిక్షపతి, మాడుగుల అశోక్, దార్న శ్రీనివాస్, రజనాచారి, కండె సుధాకర్, అంబాల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.