వరంగల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయ్యింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 120 ఫీట్ల పొడవు, 80 మీటర్ల వెడల్పుతో పకడ్బందీగా వేదికను సిద్ధం చేశారు. 400 మంది కూర్చునే విధంగా నిర్మించారు. బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న లక్షలాది మందితో రజతోత్సవ సభ జరుగనున్నది. సభకు వచ్చే లక్షలాది మంది ఆ ప్రాంగణంలో ఏ చివర ఉన్నా.. వేదికపై ప్రసంగించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనిపించేలా స్థలాన్ని ఎంపిక చేశారు. సాంకేతికంగా అన్నీ చూసుకొని వేదిక నిర్మాణం చేపట్టారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో సభ సాయంత్రం తర్వాత జరగనున్నది. అందుకు అనుగుణంగా సభా ప్రాంగణం మొత్తం వెలుగులతో ఉండేలా భారీ స్థాయిలో లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జనరేటర్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. లక్షలాది మందికి కేసీఆర్ ప్రసంగం స్పష్టంగా వినిపించేలా అత్యాధునిక సౌండ్ సిస్టంను అమర్చుతున్నారు.
వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లను అనుసంధానం చేసేలా మొరంతో అంతర్గత రోడ్లను సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల నుంచి మహాసభ ప్రాంగణానికి ప్రజలు నడిచి వచ్చేందుకు అంతా చదును చేశారు. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంతోపాటు దీనికి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా నాలుగు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఎల్కతుర్తి నుంచి వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జాతీయ రహదారుల్లో ఒక్కొక్కటి చొప్పున, మహాసభ ప్రాంగణంలో ఒకటి చొప్పున మొత్తంగా నాలుగు అంబులెన్స్‌లను పెట్టే ప్రదేశాలను ఎంపిక చేశారు. అవసరమైన ప్రదేశానికి వెంటనే అంబులెన్స్ వెళ్లేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో పనులు వేగంగా చేపడుతున్నారు.
రేపు కేటీఆర్ రాక
రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎల్కతుర్తికి రానున్నారు. సభకు వచ్చే లక్షలాది మందికి అవసరమైన వసతులు, వేలాది వాహనాల పార్కింగ్‌కు అనుగుణంగా జరిగిన పనులను… అత్యవసర వైద్య వసతుల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు జన సమీకరణ ఏర్పాట్లపై వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు.
ఒక్క పని కూడా చేతగాని కాంగ్రెస్ సర్కారు.. కేసీఆర్ చేసిన పనులను ఆపుతున్నది. ఒక్కటన్నా చేసిండ్రా అంటే అది ఒకే ఒక్క ఫ్రీ బస్సు! రాజకీయాల్లో సీట్ల కోసం
తన్నుకుంటుంటే గమ్మతి గని.. బస్సులో సీట్ల కోసం సిగపట్లకు దిగే పరిస్థితి వచ్చింది. – కేటీఆర్