హనుమకొండ చౌరస్తా, మే 20 : హనుమకొండ అశోకా కాంప్లెక్స్‌లోని నవచేతన బుక్‌హౌస్‌లో మంగళవారం పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనను నవచేతన విజ్ఞాన సమితి గవర్నింగ్‌బాడీ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని, ప్రతి ఒక్కరూ పుస్తకాలను నిరంతరం పఠించాలన్నారు.
ఈ పుస్తక ప్రదర్శనలో వివిధ రకాల పబ్లిషర్స్, రచయితలు, కవుల పుస్తకాలు అందుబాటులో ఉంచామని అన్ని రకాల పుస్తకాలపై 10 శాతం నుంచి 30 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ పుస్తక ప్రదర్శన జూన్ నెల 10 వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యాసంస్థలు, మేధావులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అరసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మార్క శంకర్‌నారాయణ, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ర్ట సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, నవచేతన బుక్ హౌస్ మేనేజర్ ఎర్ర నాగరాజు, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, నాయకులు ఏదునూరి వెంకట్రాజం, దండు మోహన్, ఎండీ ఉస్మాన్ పాషా, తాండూరి గోపి, పి. కిషోర్ కుమార్, సిబ్బంది రమేష్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.