భీమదేవరపల్లి, జూన్ 28: భారత మాజీ ప్రధాని, భారత రత్న, బహుభాషా కోవిదుడు దివంగత పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువవలేమని బీజేపీ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని వంగర గ్రామంలో పీవీ 104వ జయంతి వేడుకలు అతని ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాచర్ల కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారని తద్వారా దేశం ఆర్థిక బాటలో పయనించిందన్నారు.
వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్థం ప్రభుత్వం నిర్మిస్తున్న పీవీ జ్ఞానవేదిక నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని కోరారు. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తించి గతేడాది మోడీ ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించిందని గుర్తు చేశారు. పీవీని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఊసకోయిల కిషన్, నోముల బిక్షపతి, కంకల సదానందం, శనిగరపు ఐలయ్య, బొల్లంపల్లి శ్యామ్, అయితా సాయి తేజ, గాజుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.