Banjara | బంజారాలు (Banjara) సింధు నాగరికత కాలం ముందు నుంచి ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, గుజరాత్, కేతేవాడ, హరప్పా మరియు మహెంజోదారోలోని గోర్ ప్రావిన్సులతో పాటు రాజస్థాన్ ప్రాంతం నుంచి రాజ్పుత్ వంశపారంపర్యంగా వచ్చి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో ఉప్పు వ్యాపారం చేస్తూ జీవనము సాగించే వారని చరిత్రకారుల అభిప్రాయం. అలాగే నిజాం నవాబ్ రాజ్యంలో సైనికులకు మందుగుండు సామాగ్రీల సహాయం అందించినందుకుగానూ ఆనాటి నిజాం నవాబులు వీరి సేవలకు గుర్తింపుగా గోల్కొండ కోట ద్యారాలలో ఒక ద్వారానికి ‘బంజారా ద్యారము’ అని పేరుపెట్టినట్లు చెబుతారు. హైదరాబాద్లోని ‘బంజారా హిల్స్’ ప్రాంతాన్ని బంజారాలకు నివాసము కోసం కానుకగా ఇచ్చారనేది చారిత్రక వాదన.
ఆ తరువాత కాలం నుంచి బంజారాలు అడవులు, గుట్టలు, కోనలు, నీటి ప్రవాహాల నడుమ జీవిస్తు, వంట చెరుకు కట్టెలను కొట్టి గ్రామాలకు వెళ్లి అమ్మడం, ఇంటి ముందు మట్టిని అలకడం కోసం ఎర్రమట్టిని ఎద్దుల బండ్లలో నింపి అమ్ముకోవడం, గొర్లు, మేకలు, కోళ్ళు, పశుసంపదను పెంచుకోవడం వీరి ఆనవాయితీ. అలనాడు చదువు లేకున్నా తాము తీసుకునే ఆహారం, పరిశుభ్రత, రోగం వస్తే చెట్ల పసర్లతో వైద్యం నేర్చున్నారు. అడవుల్లో, గుట్టల నడుమ జీవించిన పట్టణాలు, పల్లెల నాగరికత ప్రపంచానికి సరిసమానంగా జీవించారు. వీరి ఆరాధ్య దైవం సీతాల మాత (సప్త మాతృకలు) పండుగ. అత్యంత వైభవంగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజున జరుపుకుంటారు. ఆ పండుగ విశేషాలు, ప్రత్యేకతని ఒకసారి చూసొద్దాం..
ప్రాచీన కాలానికి చెందిన కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు, ఒకే శిలా ఫలకంపై చెక్కబడినవిగా ఒకేవరుసలో కొలువుదీరినవిగా ఏడుగురు అమ్మవారి రూపాలు దర్శనమిస్తుంటాయి .. అవే ‘సప్తమాతృకలు’. ఈశక్తి స్వరూపాల ఆవిర్భావంవెనుక, ఒక ఆసక్తికరమైన కథవుంది. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు తనుపొందిన వరబలం చేత గర్వించి, దేవతలను, మహర్షులను అనేక విధాలుగా హింసిస్తుంటాడు. దాంతో దేవతల ప్రార్ధన మేరకు ఆ అసురుడిని సంహరించడానికి పరమశివుడు రంగంలోకిదిగి, బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలశక్తులతో సప్తమాతృకలైన బ్రహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండిలనే సర్వదేవతల శక్తిస్వరూపాలను సృష్టిస్తారనే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.
ఆనాటి బంజారాలకు ముఖ్యమైనది పశు సంపద..
పూర్వము బంజారాలు పశుపోషణ, వ్యవసాయానికి ఎక్కవ ప్రాదాన్యత ఇచ్చేవారు. అటువంటి క్రమంలో వర్షాకాలంలో తొలకరి చినుకులతో మెదలయ్యే ఆశాఢ మాసములో మెదటి మంగళవారం రోజున ఈ పండుగను పిల్లపాపలతో, కుటుంబ పరివారము సమేతముగా, పకృతి ఒడిలో జరుపుకునే మొదటిపండుగే ఈసీతాలమాతపండుగ/సప్తమాతృకలపండుగ అంటారు.
సప్తమాతృకలు అనగా హిందూ సంప్రదాయంలో ఏడుగురు తల్లిదేవతల సమూహం. అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే.. పూర్వం అంధకాసురుడి రాజ్యంలో రక్తభీజుడనే రాక్షసుడు ఘోరతపస్సు చేసి పరమశివుడి నుంచి.. తనను ఎవరైనా గాయపరిచిన.. ప్రతి రక్తపు చుక్కనుంచి పదిమంది తనలాగ ఉద్భవించే వరాన్నిపొందాడు రక్తభీజుడు.. అటు దేవలోకాన్ని ఇటు భూలోకాన్ని అతలాకుతలము చేస్తున్న క్రమంలో సమస్త దేవతలు భయాందోళనకు గురై కైలాసము చేరుకున్నారు. రక్తభీజుడనే రాక్షసుడి నుంచి సమస్త లోకములను రక్షించమని పరమ శివుడిని శరణుకోరారు. మీరు రక్తభీజునికి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకుని రక్త బీజుడిని శిక్షించమని అర్థించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశక్తి అయిన పార్వతీమాతను వేడుకొని సమస్తలోకాన్ని రక్షించమని, రక్తబీజుణ్ణి తుదముట్టించమని కోరగా.. అప్పుడు పార్వతీ దేవి ఆదిశక్తి అవతారం ఎత్తి రక్తబీజున్నీ ఖండిస్తుంటే.. నేలమీద పడ్డ ప్రతిఒకరక్తపు చుక్కనుంచి పదిమంది రక్తభీజులు అవతరించి చెలరేగుతున్నారు, ఎన్నిసార్లు ఖండించినా అన్నిసార్లు వందల, వేలసంఖ్యలో రక్తభీజులు ఆవిర్భవిస్తున్నారు. ఆక్రమంలో సమస్తదేవతలు భయాందోళనకు గురై, వారి సమిష్టి ఆశీస్సులతో సప్త మాత్రికలను సృష్టించారు. పార్వతీ దేవికి తోడుగా రక్తబీజుడి రక్తం నేలమీద పడకుండా సప్తమాత్రికలు కలిసికట్టుగా రక్తబీజున్నీ తుదముట్టించడంలో విజయంసాధించారు.
ఈ విజయగాధాన్ని అర్థంచేసుకున్న బంజారా నాయకులు తమ జీవన ఆధారమైన పశుసంపదలైన ఆవులు…అడవులకు మేతకు వెళ్లినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో సింహాలు, పులుల దాడుల్లో పశువులు ప్రాణాలు కొల్పోయేవి. దీంతో బంజారాలు తమయొక్క మనోగాథను సప్తమాత్రికల ముందుంచి పూజించాలనే ఆలోచనకు బీజం పడింది. ఉదయము నుంచి నియమ నిష్టలతో రోజంతా ఉపవాసమున్న పూజారి(పెద్దమనిషి) తండాకు దూరంగా ప్రకృతి ఒడిలో ఏడుగురుదేవతలను (సప్త మాతృకలు) 1. మేరమ్మ భవానీ, 2. తుల్జా భవానీ, 3. సీతాల భవానీ , 4.అంబా భవానీ, 5.హింగ్లా భవానీ, 6.ధ్వాళాంగర్ భవానీ, 7.కంకాళీ భవానీలతోపాటు 50 అడుగుల దూరంలో లుకిడియా(రక్తభీజుడు)ని చిన్న కోనేరులో ప్రతిష్టిస్తారు. ప్రతి ఇంటినుంచి ఆడబిడ్డలు సాంప్రదాయ దుస్తులు ధరించి, డోలు వాయిద్యాల నడుమ ఆటపాటలతో, నృత్యాలతో తండా పెద్దల మార్గాన్ని అనుసరిస్తారు. తలపైన అమ్మవార్లకు సమర్పించే నైవేద్యాలను పెట్టుకొని, వారిసూచనల మేరకు రూపాయి బిల్లలను కానుకలుగా సప్తమాతృకల దగ్గరన్న పూజారికిచ్చి అమ్మవార్లకు భోగ్ బండారో(హోమం) రూపంలో నైవేద్యం సమర్పిస్తారు.
మేతకోసం అడవికి వెళ్ళిన పశువులు, మనషులను సింహలు, పులులు వంటి క్రూర జంతువుల బారినపడకుండా క్షేమముగా ఇంటికి తిరిగి రావాలని, ఒకవేళ క్రూర జంతువుల గాయపరిచితే ఆనాడు రక్తబీజుడికిచ్చిన వరమే మాకు, మా మూగజీవాలకు ఇవ్వాలని భక్తి పారవశ్యంతో వేడుకుంటు సప్తమాతృకల ముందు బలి ఇచ్చిన రక్తాన్ని నవధాన్యాలలో రంగరించి, మేకపోతు యొక్క ప్రేగును లుంకిడియ(రక్తబీజుడు)వరకు పరచి తండాకు సంబందించిన మొత్తం పశువులను ఆ మేకపోతు ప్రేగుపై నుంచి దాటిస్తారు. మమ్మల్ని చల్లంగా చూడాలని వేడుకుంటూ ఆ రక్తపు చుక్కలను పశు సంపదలపై జల్లుతారు. పశుసంపద దిన దినాభివృద్ధి చెందాలని భక్తిభావంతో పూజించడాన్ని ‘దాటోడిపండుగ’ దీనినే సీతాల పండుగ అని కూడా పిలుస్తారు.
అదేవిధంగా వర్షాకాలం ప్రారంభంలో.. పరిసర ప్రాంతాలు బురదమయంకావడంతో పాటు, ఆ బురదలో అనేక క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఉద్భవించి చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళు అనేక అంటు రోగాల బారినపడి మృత్యువాత పడతారు. అటువంటి భయంకరమైన అంటురోగాలు తమ దరిచేరకుండా ఉండాలని కూడా సీతాలమాత (సప్తమాతృక)లను కుటుంబసమేతంగా వచ్చి వేడుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని లుంకిడియ/రక్తబీజుడి ముందు కోనేరులాగా తయారుచేసి ప్రతిఇంటి నుండి చిన్న కడువలో తీసుకొచ్చిన మంచినీటితో అభిషేకం చేస్తారు. ఆ నీరు పొర్లి ప్రవహినచినట్లే తమ చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటారు. తమ పాడి పంటలు బాగా ఉండాలని, తమ పరివారం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని నిండు మనసుతో సప్త మాతృకలను ప్రార్థిస్తారు.
బీవీఆర్ నాయక్, రచయిత
బంజారా(లంబాడీ)లకు ఆరాధ్య దైవం సీతాలమాత పండుగ
తెలంగాణ ప్రజలకు హారతి దైవం బోనాల పండుగ వలె బంజారా బిడ్డలకు అత్యంత ప్రాధాన్యత కలిగినది సీతాల మాత పండుగ. ఆది నుంచి పండుగ విశేషాలను కనుగొనేందుకు చాలా సంవత్సరాలు పుస్తకాలు తిరిగేసాను. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో చర్చించాను. తిరుమల కొండపై గోగర్భ తీర్థం వద్ద శివాలయం పక్కన కొలువు దీరిన సప్తమాతృకలను పరిశీలించాను. అప్పుడు విశాఖ పట్టణానికి చెందిన కొంతమంది మాతాజీలు శీతల మాత (దాటోడి) పండుగ, సప్తమాతృకల వైభవాన్ని వివరించారు.
-గుడికందుల కిషోర్, హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం.