Telangana Assembly | హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించింది.
అనంతరం తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, పురపాలక సంఘాల సవరణ బిల్లు, టీఎస్ఎస్ ఆడిట్ నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వార్షిక నివేదికను మంత్రి భట్టివిక్రమార్క, నిజాం షుగర్స్ లిమిటెడ్ వార్షిక నివేదికలు, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ నివేదికలను మంత్రి శ్రీధర్ బాబు, అటవీ అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికను మంత్రి కొండా సురేఖ, కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ ముందు ఉంచుతారు.
కాగా, సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆదివారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. సాధారణంగా సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. దీనికి కారణం ముఖ్యమంత్రి సౌకర్యం కోసం అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్లు రాజకీయవర్గా్ల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం కూడా సభను నడపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. కాగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి కేరళలోని అలెప్పీలో జరిగే పుస్తకావిష్కరణ సభకు వెళ్లాల్సి ఉన్నది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సంకటంలో పడ్డారు. ఇటు అసెంబ్లీలో పీసీ ఘోష్ నివేదికను ప్రవేశపెట్టేందుకు సర్కారు ముహూర్తం ఖరారుచేసింది. మరోవైపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సౌకర్యం కోసం అసెంబ్లీ ప్రారంభ సమయాన్ని ఉదయం 9గంటలకు మార్చినట్టు తెలిసింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత సీఎం అసెంబ్లీలో ప్రసంగించి అక్కడి నుంచి నేరుగా కేరళ వెళ్లిపోతారని సమాచారం. ఇందుకోసం శాసనసభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కూడా ఎత్తేసినట్టు చర్చ నడుస్తున్నది.