న్యూఢిల్లీ: రష్యా చమురు కొనుగోళ్లను (Russion Oil) సాకుగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు (Trump Tariffs) విధించారు. మాస్కో నుంచి క్రూడాయిల్ కొనడాన్ని ఆపాల్సిందేనని, లేనట్లయితే మరిన్ని సుంకాల వాతలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో అప్పటివరకు భారత్, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు (Trade Talks) నిలిచిపోయాయి. ట్రంప్ తన నిర్ణయంపై ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో భారత్ ప్రత్యామ్నాయ దారులు వెతికే పనిలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య చర్చల నుంచి భారత్‌కు వెనక్కు తగ్గిందని, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ (Subhash Garg) అన్నారు. ట్రంప్ ఏకపక్ష సుంకాలు 50 శాతం వరకు ఉండటంతో న్యూఢిల్లీ ఇప్పటికే చర్చల నుండి సమర్థవంతంగా వైదొలిగిందని జాతీయ మీడియాతో చెప్పారు. రష్యా నుంచి తక్కువకే ముడి చమురును కొనుగోలు చేస్తూ భారత్ భారీగా లాభాలు పొందుతుందంటూ ట్రంప్ అదేపనిచేస్తున్న వాదనలను ఆయన ఖండించారు. ఈ ఆరోపణ ఒక రాజకీయ నాటకమని, ఆర్థిక వాస్తవికత కాదని పేర్కొన్నారు.
రష్యా ముడి చమురు కొనుగోలు వల్ల భారత వాస్తవ పొదుపు ఏడాదికి 25 బిలియన్ యూఎస్ డాలర్లు కాదని, అది సుమారు 2.5 బిలియన్ అమెరికా డాలర్లు ఉందని చెప్పారు. ఇలా ఏ సంఖ్య అయినా చెప్పవచ్చు. దానివల్ల పెద్దవచ్చే తేడా ఏమీ లేదు. కానీ ట్రంప్ దానిని భారతదేశాన్ని శిక్షించడానికి కత్తిగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. షిప్పింగ్, బీమా, బ్లెండింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత భారత్‌కు అందుతున్న డిస్కౌంట్ బ్యారెల్‌కు 3 నుంచి 4 అమెరికన్ డాలర్లు మాత్రమేనని వెల్లడించారు. చమురు కొనుగోలు విషయంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం లేదని స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల స్థాయిలలో ఎవరూ వ్యాపారం చేయలేదన్నారు. అగ్రరాజ్యం ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాగా, మోదీ చెప్పినట్లు అమెరికా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెప్పారు. వస్తు వినియోగం, సేవారంగాలలో భారత్-అమెరికాలు లోతుగా కలిసిపోవడమే దీనికి కారణమని చెప్పారు.