వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్యంపై తీవ్ర చర్చ నడుస్తున్నది. అసలు ఆయన బతికే ఉన్నారా? ట్రంప్‌కు ఏమైంది, ఆయన ఆరోగ్యంగా లేరా? అంటూ ఇంటర్నెట్లో నెటిజన్లు జోరుగా సెర్చ్ చేస్తున్నారు. దీంతో గూగుల్ సెర్చ్, సోషల్ మీడియాలో #TrumpIsDead, #WhereIsTrump తెగ ట్రెండింగ్‌గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 60 వేలకుపైగా పోస్టులు పుట్టుకొచ్చాయి. గ్రోక్ తదితరాల్లోనైతే ఏకంగా 13 లక్షల మందికిపైగా ఈ విషయమై ఆరా తీశారు. 79 ఏండ్ల ట్రంప్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత జూలైలో ఆయన చేతికి గాయం, కాళ్ల మడిమల వాపుతో కన్పించడంతో పుకార్లు శికార్లు అయ్యాయి. దీనికితోడు తాను అధ్యక్ష పదవి చేపట్టడానికి రెడీ అంటూ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత ఆజ్యం పోశాయి.
అయితే తాజాగా వీటన్నింటికీ ట్రంప్ ఫుల్స్టాప్ పెట్టారు. ఈ నెల 26 తర్వాత ఆయన తొలిసారిగా వైట్‌హౌస్ వెలుపలికి వచ్చారు. శనివారం ఉదయం 8.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తన మనవరాలు కాయ్ ట్రంప్, మనవడు స్పెన్సర్ ఫ్రెడరిక్ ట్రంప్‌తో కలిసి శ్వేతసౌధం నుంచి బయటకు వచ్చారు. తెల్లని పోలో షర్లు, నలుపురంగు ప్యాంటు, ఎరుపురంగులో ఉన్న ఎఏజీఏ హ్యాట్ ధరించి వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్‌కు (Golf Club) వెల్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వారి ఫొటోను పలువురు తమ కెమెరాల్లో క్లిక్ మనిపించారు. కాగా, అంతకుముందు ప్రపంచ దేశాలపై టారీఫ్‌లు విధించే చట్టబద్ధ అధికారం అధ్యక్షుడికి లేదంటూ అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో (Truth Social) పోస్టు చేశారు.