నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 30 : పొలం పనుల్లో బిజీ గా ఉండాల్సిన రైతులు యూరియా కోసం సాగుకు దూరమవుతూ అరిగోస పడుతున్నారు. అదునుకు ఎరువులు దొరకక పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనతో కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు. అధికారులు టోకెన్లు ఇచ్చినప్పటికీ ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నా రు. చివరికి సహనం నశించి ఆందోళనలకు దిగుతున్నారు. తమకు సరిపడా యూరియా బస్తాలు అందించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ గోదాము వద్దకు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పది రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేవలం 444 బస్తాలు మాత్రమే పంపిణీ చేయడంతో కొ ద్ది మందికే లభించింది. ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ టోకెన్లున్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా సుదర్శన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందుచూపు లేమి రైతుల పాలిట శాపంగా మారిందదన్నారు. యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నా రు.
అలాగే మహబాబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ సిబ్బంది వారం రోజుల క్రితం టోకెన్లు ఇచ్చిన వారికి యూరియా ఇస్తామని చెప్పడంతో వద్దకు రైతులు భారీగా తరలివచ్చి బారులు తీరారు. తీరా సిబ్బంది వచ్చి ఇవాళ లారీ లోడ్ రావడం లేదని సొసైటీకి తాళం వేసి వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంప్ ఆపీస్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. నర్సింహులపేట మండల కేంద్రం లో యూరియా కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రైతులు ధ ర్నా చేశారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో చేపట్టా రు.
ఆందోళన చేస్తున్న రైతులతో ఎస్సై సురేశ్ మాట్లాడి ఆధార్, పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్ ప్రతులను తీసుకున్నారు. ఈ క్రమంలో పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చిన ఏవోను రైతులు చు ట్టుముట్టారు. ఒక్క యూరియా బస్తా ఇయ్యండి అంటూ జయపు రం గ్రామానికి చెందిన మహిళా రైతు మందుల కళమ్మ ఏవో కాళ్లు మొక్కింది. గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు రాస్తారోకో చేపట్టారు. కురవి మండలం గుండ్రాతిమడుగు సొసైటీకి యూరియా వచ్చిందని చుట్టుపకల గ్రామాల రైతులు వందలాదిగా తరలివచ్చారు. అక్కడకు సిబ్బంది తో చేరుకున్న ఎస్సై గండ్రాతి సతీశ్ రైతులను రైతు వేదిక వద్దకు తరలించి, లైన్లో నిలుచున్న వారికి కూపన్లు ఇచ్చారు.
రెండు రోజు ల క్రితం టోకెన్లు తీసుకున్న వారికి 300 బస్తాల పంపిణీ చేశారు. కాగా, నర్సంపేట మండలం గురిజాల సొసైటీ గోదాము వద్ద గురిజాల, గుంటూరుపల్లి, లింగాపురం, గుర్రాలగండి, రాజపల్లి, చిన్న గురిజాల గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు క్యూలో నిల్చున్నారు. వ్యవసాయ, సొసైటీ అధికారులు ఆధార్‌కార్డు, పట్టాపాస్ బుక్ జిరాక్స్‌లను పరిశీలించి ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాను మాత్రమే అందించారు. అలాగే ఖానాపురం మండ ల కేంద్రంలోని సొసైటీ గోదాము వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులకు అడిగినంత యూరియా ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద నో స్టాక్ బోర్డు పెట్టడంతో యూరియా కోసం వచ్చిన రైతులు కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం సొసైటీకి 222 బస్తాల యూరియా వచ్చిందనే సమాచారంతో పలు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తెల్లవారుజామున 4 గంటలకే చేరుకుని ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూలో పెట్టారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే అందించడంతో సుమారు 600 మంది యూరియా దొరకక నిరాశతో వెళ్లిపోయారు. కేసముద్రం మండలం కల్వలకు 430 బస్తాల యూరియా రాగా, సుమారు వెయ్యి మంది రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉద యం వరకూ క్యూలో ఉన్నా అందరికీ దొరకకపోవడంతో నిరాశ చెందారు.
మరోవైపు నెల్లికుదురు మండలంలోని పలు గ్రామాల రైతులు సైతం రావడంతో అధికారులు టోకెన్లు అందించారు. చెట్ల ముప్పారం వెళ్లే దారిలో రైతులు బారులు తీరగా ట్రాఫిక్‌కు ఇబ్బం ది ఏర్పడడంతో మోడల్ స్కూల్‌కు తీసుకెళ్లగా, విద్యార్థులు వస్తుండడంతో మళ్లీ రైతువేదిక వద్దకు తరలించారు. దీంతో గందరగోళం నెలకొనడంతో యూరియా బస్తాలు నిల్వ ఉన్న గోదాముకు పోలీసులు తాళం వేసి వెళ్లిపోయారు. మరిపెడలోని సొసైటీకి 200 బస్తాల యూరియా వచ్చిందన్న సమాచారంతో సుమారు వేయి మంది రైతులు తరలిరాగా అందరికీ అందకపోవడంతో వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగిపోయారు. ములుగు జిల్లా జేడీ మల్లంపల్లిలో రైతులు యూరియా కోసం శనివారం పడిగాపులు కాసినా ఫలితం లేకుండాపోయింది. తెల్లవారుజాము నుంచి వేచి ఉన్న రైతులు అధికారుల, సిబ్బంది రాక కోసం ఎదురు చూశారు. తీరా సోమవారం యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో వెళ్లిపోయారు.
కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి 500 యూరి యా బస్తాలు వచ్చాయని తెలిసి తెల్లవారుజాము నుంచే 1500 మంది రైతులు ఆధార్‌కార్డులు, చెప్పులు క్యూలో పెట్టి వేచిచూశా రు. దీంతో మిగతా వారికి తర్వాత ఇస్తామంటూ రైతుల వద్ద నుం చి ఏవో, ఎస్సైలు ఆధార్‌కార్డు జిరాక్స్‌లను సేకరించారు. కొంతమంది సద్దులు తెచ్చుకొని అక్కడే భోజనం చేయగా, మరికొందరు మహిళలు తిండిలేక స్పృహ కోల్పోయి కనిపించారు. అలాగే జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ బ్యాంకు వద్దకు వందలాదిగా రైతులు తరలివచ్చి క్యూలో చెప్పులు పెట్టారు. అప్పటికే యూరియా లేదని బ్యాంక్ సిబ్బంది, వ్యవసాయ శాఖాధికారులు నోస్టాక్ బోర్డు పెట్టడంతో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు ఇప్పించలేని ఎమ్మెల్యే దిగిపోవాలని డిమాండ్ చేశారు.