మరిపెడ/నెల్లికుదురు/ డోర్నకల్, ఆగస్టు 30 : సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఆ రాత్రి వారికి కాళ రాత్రే అయింది. ప్రజలు సర్వం కోల్పోయారు. ఒక్కసారిగా చుట్టముట్టిన వరదలు.. ఇండ్లలోకి నడుముల లోతు చేరిన నీళ్లు.. కళ్లెదుటే కొట్టుకుపోతున్న గొడ్డూగోదా.. ఏం చేయాలో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డాబాలపై వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఒక్కసారిగా ముంచెత్తిన వరదతో ఆ ప్రాంతాలన్నీ మరుభూమిని తలపించాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అనేక హామీలిచ్చినా నేటికీ అవి అమలు కాలేదు.
ఏకధాటిగా కురిసిన వానలు.. పోటెత్తిన వరద గతేడాది ఆగస్టు 31 అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. ఆకేరు ఉప్పొంగడంతో దాని పరివాహక ప్రాంతాలైన మరిపెడ మండలంలోని సీతారాంతండా, ఉల్లేపల్లి, బాలీధర్మారం గ్రామాల్లోకి ఒక్కసారి వరద నీరు చేరింది. సీతారాంతండా పూర్తిగా జలమయమైంది. తం డావాసులు డాబాలపై ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నా రు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ప్రత్యేకబృందాలతో వెళ్లి తండావాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తండాలో భారీ గా ఆస్తి నష్టం వాటిల్లింది. బాల్నీ ధర్మారం, జల్లెపల్లి గ్రా మాలను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జి సుమారు అర కిలోమీటర్లు మేర కొట్టుకుపోయింది.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన యువ శాస్త్రవేత నూనావత్ అశ్వని తన తండ్రి మోతీలాల్లో కలిసి హైదరాబాద్ వెళ్తూ.., పురుషోత్తమయాగూడెం బ్రిడ్జి వద్ద రాత్రి సమయంలో నీటి ప్రవాహం కనబడక వారు ప్రయాణిస్తున్న కారు వరద ఉధృతికి కొట్టుకుపోయి తండ్రి కూతు రు మృతి చెందారు. అధికారిక లెక్కల ప్రకారం సీతారాంతండాలో 49 ఇండ్లు, బాల్నిధర్మారంలో 10 ఇండ్లు, తండ ధర్మారంలో 10ఇండ్లు, ఉల్లేపల్లిలో 123 ఇండ్లు నీటమునిగి ప్రజలు సర్వం కోల్పోయారు. సుమారు 5వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సీతారాంతండాలో పర్యటించి బాధిత కుటంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. కానీ, అవి నిజమైన లబ్ధిదారులకు అందలేదు. ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల వారికి ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, నేటికీ అమలు కాలేదు.నెల్లికుదురు మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామం పెద్ద చెరువు తెగిపోయి గొలుసుకట్టు చెరువులతో ఆ చెరువు నీళ్లన్నీ రావిరాల గ్రామ పెద్ద చెరువులోకి చేరి గ్రామంలో బీభత్సం సృష్టించాయి. గ్రామం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఆ గ్రామానికి చుట్ట పక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇండ్లలోకి నడుముల లోతు నీళ్లు చేరడంతో ప్రజలంతా డాబాలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ విషాదఘటనలో గ్రామంలో 8 ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
పదుల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు, పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. చెరువు కట్టకింద ఉన్న 566 ఎకరాల పొలాలు నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. చెరువు కట్టకు ఇప్పటి వరకు మరమ్మతు చేయించకపోవడంతో రైతులు మూడు పంటలు నష్టపోయారు. డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులోని ఆకేరువాగు బ్రిడ్జి వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ బ్రిడ్జిని పరిశీలించారు. కానీ, నేటి మరమ్మతు పనులు చేయించలేదు. దుబ్బగడ్డతండా, మోదుగు గడ్డతండా, ముల్కలపల్లి ఎస్సీ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
2024 ఆగస్టు 31 తేదీ గుర్తుకొస్తే వెన్నులో వణుకుపుడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు రావడంతో భయంతో బయటకు వచ్చాం. రాత్రి ఏమీ కనపడడంలేదు. క్షణాల్లోనే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వెంటనే నా భార్య, పిల్లలను తీసుకొని బిల్డింగ్‌పైకి ఎక్కి ప్రాణభయంతో తెల్లవార్లు గడిపాం. 5 నిమిషాల్లోనే తండా అంత మునిగింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు.
– అజ్మీరా సీతారాం
ముల్కలపల్లి శివారులోని ఆకేరు వాగు బ్రిడ్జి గతేడాది వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. ఏడాది గడిచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరద తీవ్రత పెరిగితే వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలి.
– దేవురపల్లి నాగేశ్వరరావు, ముల్కలపల్లి