హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 9: క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్‌ఖాన్ అన్నారు. సోమవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో సీఎం కప్ -2026 జిల్లాస్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ క్రీడల్లో రాణించేవారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మంచి పేరు వస్తుందని, అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు అర్జున్, పారా ఒలంపిక్ లో కాంస్య పతకం సాధించిన దీప్తిదివాంజి మన జిల్లా క్రీడాకారులు కావడం గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడం వలన క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చని, చాలామంది చిన్నారులు సెల్‌ఫోనుకు అతుక్కుపోతున్నారని, తల్లిదండ్రులు గమనించి క్రీడల్లో పాల్గొనేలా సూచించారు.
ఇందుకు శ్రమించిన హనుమకొండ క్రీడా అధికారి అశోక్ కుమార్‌ను అభినందించారు. రాష్ర్టంలోనే హనుమకొండను క్రీడా హబ్‌గా చేసేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.
జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలకు అద్భుత స్పందన వచ్చిందని, మొదటిరోజు 13 క్రీడాంశంలో సుమారు 2500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. రెండు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయని, 30 క్రీడాంశంలో పోటీలు నిర్వహిస్తున్నామని, 15 క్రీడల్లో డైరెక్ట్ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ నాయకులు సారంగపాణి, పవన్‌కుమార్, వీరన్న, ఎర్రగట్టు స్వామి, ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్, కోచ్‌లు, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.