హనుమకొండ చౌరస్తా, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య(Vemulapalli Venkatramaiah) డిమాండ్ చేశారు. సంస్కరణల పేరిట నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై రుద్దాలనుకుంటున్న ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ జనరి 6 నుంచి 24వ తేదీ వరకు గ్రామ మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని వెంకట్రామయ్య పిలుపునిచ్చారు.
హనుమకొండ ప్రెస్ క్లబ్లో శనివారం సంఘం అధ్యక్షుడు మామిడాల బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలి. ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధంగా అమలు చేయాలి. జాబ్ కార్డు ఉన్న వారికి 200 రోజులు పని కల్పించాలి. ఒక రోజు వేతనంగా రూ. 600 ఇవ్వాలి అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు వి.కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, నాయకులు బండారి ఐలయ్య, గుజ్జు దేవేందర్, నందగిరి వెంకటేశ్వర్లు, డేవిడ్కుమార్, తుపాకుల నాగేశ్వరరావు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, ఉపాధ్యక్షుడు బొమ్మిడ సాంబయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ పాల్గొన్నారు.