ధర్మసాగర్ : మామిడి తోట రైతులు పూత దశలో సమగ్ర యాజమాన్య చర్యలు తీసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు సూచించారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ విజయ భాస్కర్, మామిడి తోట రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మామిడి తోట పూత దశ లో ఉన్నందున సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని, పూత రాలకుండా చేయాల్సిన పిచికారీ మందుల గురించి వివరించారు. మామిడితోట రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు రాయితీ అందిస్తుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి అనసూయ, డివిజన్ అధికారి సుష్మిత, ఉద్యాన విస్తరణాధికారి దేవరాజ్, ఏఈవో పవన్, తదితరులు పాల్గొన్నారు.