హనుమకొండ, జూన్ 27 : బాలల సంరక్షణ కేంద్రాల భవనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరని జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్రెడ్డి స్పష్టం చేసారు. జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను అదనపు కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేసారు. జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి ఫాతిమానగర్ లోని డివైన్ మెర్సీ, హనుమకొండలోని ప్రభుత్వ బాలసదనం, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ నిబంధనల మేరకు కనీస ప్రమాణాలు పాటించాలన్నారు.
ముఖ్యంగా భవనాలకు సంబంధించిన సౌండ్నెస్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్లను సంబంధిత ఆధికారుల నుండి తీసుకోవాలని, తీసుకోని సంస్థలకు నోటీసులు ఇచ్చి గడువులోగా తీసుకొనేలా సంబంధిత కమిటీ, అధికారులు చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శానిటేషన్ సర్టిఫికెట్, వాటర్ ప్యూరిఫికేశన్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డార్మెటరీ, వాష్ రూమ్స్, డైనింగ్ హాల్, పరిసరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. రికార్డులను, పిల్లలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
లైసెన్స్ కలిగిన సంస్థలు తప్పకుండా కనీస ప్రమాణాలు పాటించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అన్మనేని అనిల్ చందర్ రావు, సభ్యుడు సందసాని రాజేంద్ర ప్రసాద్, ఇన్చార్జి డిసిపిఓ ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం మౌనిక తదితరులు పాల్గొన్నారు.