హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 25: కాకతీయ యూనివర్సిటీ భూముల్లోని సీఆర్పీఎఫ్ భూములను వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేయూ కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు భైఠాయించి ధర్నా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ర్ట కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ గతంలో నక్సలైట్స్ప్రభావం ఉండటం వలన సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపునకు యూనివర్సిటీ భూములు కేటాయించడం జరిగిందని, నక్సల్ ప్రభావం తగ్గడం వలన సీఆర్పీఫ్ క్యాంపు ఎత్తివేయడం జరిగిందన్నారు.
యూనివర్సిటీ భూమిని ఇప్పటివరకు యూనివర్సిటీకి అప్పగించకపోగా ఆ భూములను పోలీస్ శాఖ వాడుకుంటున్నారని, ఆ భూమి యూనివర్సిటీకి వెంటనే వెనక్కి తిరిగి తీసుకోవాలని, అలాగే యూనివర్సిటీ భూములు కబ్జాకు గురికాకుండా ప్రహారి గోడ ఏర్పాటు చేయాలని, గతంలో కబ్జాకు గురైన భూములను వెనుక్కి తీసుకొని ఆ భూములను యూనివర్సిటీ ప్రయోజనాల కోసం వాడుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రంకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆల్ యూనివర్సిటీస్ ప్రాముఖ్ అంబాల కిరణ్, యూనివర్సిటీ ఇంచార్జి నిమ్మల రాజేష్, యూనివర్సిటీ అధ్యక్షులు హరికృష్ణ, యూనివర్సిటీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్, శివ, మహేందర్, వేణు పాల్గొన్నారు.