అలహాబాద్ : వరకట్నపు మరణాల కేసుల్లో భర్త లేదా అతని బంధువు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి కచ్చితమైన సాక్ష్యాధారాలు చూపాల్సిన అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం స్పష్టం చేసింది. వివాహం జరిగిన ఏడేండ్లలోపు మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది, కట్నం వేధింపులకు సంబంధించిన ఆధారాలు రుజువైతే చట్ట నిబంధనల ప్రకారం వరకట్న మరణంగా పరిగణించవచ్చని తేల్చి చెప్పింది.
తన భార్య మృతి కేసుకు సంబంధించి దోషిగా తేలిన సందీప్ సింగ్ హోరా దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపిన జస్టిస్ అబ్దుల్ మొయిన్, జస్టిస్ ప్రమోద్ కుమార్ శ్రీవాస్తవలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. హొరాకు దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షకు కుదించింది. గరిష్ఠ శిక్ష విధించడానికి ట్రయిల్ కోర్టు స్పష్టమైన కారణాలు చూపలేదని ధర్మాసనం పేర్కొంది. లక్నోలోజరిగిన ఈ ఘటనలో 2010లో దిగువ కోర్టు హోరాను దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించగా, దీనిపై ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ సమయంలో భాధితురాలు తన అత్తగారింట్లో అసాధారణ రీతిలో మరణించిందని, కట్నం వేధింపులు స్పష్టంగా రుజువయ్యాయని కోర్టు తెలిపింది.