హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులకు భూసేకరణ కష్టాలు తప్పడంలేదు. భూ సేకరణ తీవ్ర జాప్యం కావడంతో కీలక ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకు 1,020 హెకార్ల (37 శాతం) భూసేకరణ పెండింగ్‌లో ఉన్నది. రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 2,792 హెకార్ట భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,772 హెక్టార్ల (63 శాతం) భూసేకరణ మాత్రమే పూర్తయింది.
భూసేకరణ జాప్యానికి బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సేకరించాల్సిన 63 హెక్టార్ల భూమిలో ఇప్పటి వరకు 7 హెక్టార్ల భూసేకరణ మాత్రమే పూర్తయింది. ఇంకా 56 హెక్టార్లు సేకరించాల్సి ఉన్నది. మేడ్చల్-ముద్ఖేడ్, మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబ్లింగ్ ప్రాజెక్టులకు సేకరించాల్సిన 184 హెక్టార్లలో ఇప్పటి వరకు 12 హెక్టార్ల భూమి మాత్రమే సేకరించారు. మరో 172 హెక్టార్లు సేకరించాల్సి ఉన్నది.
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది. రాష్ర్టానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయకపోగా ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తున్నది. గతంలో మంజూరైన ప్రాజెక్టులకు అరకొరగా నిధులిస్తున్నది. ఇటీవల పార్లమెంట్లో కేంద్రం వెల్లడించిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం తెలంగాణలో 6 కొత్త లైన్లు, 15 డబ్లింగ్ పనులు నడుస్తున్నాయి. రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటి వరకు రూ.12 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు ఏకంగా రూ.7,611 కోట్లు కేటాయించింది. తెలంగాణకు మాత్రం రూ.5,454 కోట్లే కేటాయించింది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణంలోను కేంద్రం ఇదేవిధంగా వ్యవహరిస్తున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో కొత్తగా 885 కి.మీ. ట్రాక్‌ను మాత్రమే నిర్మించింది. తమిళనాడులో ఏకంగా 1,356 కి.మీ. ట్రాక్ పనులు పూర్తిచేసింది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. తమిళనాడు నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేరు. అయినప్పటికీ తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
