ఎంజీఎం ఆస్పత్రిలో అదనంగా నిర్మాణం
కొనసాగుతున్న ట్రయల్ రన్
థర్డ్‌వేవ్ నేపథ్యంలో అధికారుల నజర్
త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు
ఒక్కోదాని సామర్థ్యం నిమిషానికి వెయ్యి లీటర్లు
వరంగల్, జనవరి 4 (నమస్తేతెలంగాణ) : కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈమేరకు అవసరమైన వసతులను కల్పిస్తున్నది. ప్రధానంగా సెకండ్ వేవ్ సమయంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత ఈసారి రాకుండా ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నెలకొల్పిన అదనపు ఆక్సిజన్ ప్లాంట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వీటి నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరగా, కొద్దిరోజులుగా ట్రయల్న్ చేస్తున్నారు. ఎంజీఎం దవాఖానలో ఇప్పటికే రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి పక్కను నిర్మించిన రెండు అదనపు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కొత్తవాటిని నిమిషానికి వెయ్యి లీటర్ల్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ కొరత ఉండదు. ఎంజీఎం దవాఖానకి మరో వంద వెంటిలేటర్లను కేటాయించారు. అదనపు వైద్యులు, సిబ్బంది నియామకం మొదలైంది.
కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రుల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నది. ఆక్సిజన్ బెడ్స్, వెంటిలెటర్స్ వంటివి పెంచుతున్నది. అదనంగా వైద్యులను నియమిస్తున్నది. సరిపడ మందులను అందుబాటులోకి తెస్తున్నది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేపట్టిన రెండు అదనపు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం తుది దశకు చేరింది. వీటిని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కొద్దిరోజుల నుంచి ట్రయల్న్ జరుగుతున్నది. ప్రస్తుతం ఎంజీఎం దవాఖానలో రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఒకటి 19 కిలోలీటర్ల కెపాసిటీ. రెండోది 13 కిలోలీటర్లు. ఎంజీఎం ఆసుపత్రి నిర్వహణకు వైద్య ఆరోగ్యశాఖ ఈ ప్లాంట్లను వినియోగిస్తున్నది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ బెడ్స్‌కు సదరు రెండు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతున్నది. కొద్దినెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించారు. ప్రత్యేకంగా ఈ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న కరోనా వార్డును ఆయన స్వయంగా పరిశీలించారు. ఇతర వార్డులనూ పరిశీలించి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రోగులతో వైద్యసేవలపై మాట్లాడారు. ఇక్కడ వైద్యసేవలను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచనలు చేశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం ఆసుపత్రిలో అదనపు వసతుల ఏర్పాటుతోపాటు వైద్యులు, సిబ్బంది నియామకం మొదలైంది.
కొత్తగా రెండు ఆక్సిజన్ ప్లాంట్లు
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన దృష్ట్యా ప్రభుత్వం ఎంజీఎం దవాఖానలో అదనంగా మరో రెండు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆసుపత్రి ఆవరణలో ప్రస్తుతం పనిచేస్తున్న రెండు ఆక్సిజన్ ప్లాంట్ల పక్కనే వేర్వేరుగా చేపట్టిన రెండు అదనపు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం తుది దశకు చేరింది. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక జనరేటర్ ఏర్పాటు చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలోని ఆక్సిజన్ బెడ్లకు సరఫరా చేసేందుకు ప్లాంట్ల నుంచి పైపులైన్లను అమర్చుతున్నారు. థర్డ్‌వేవ్ రావడంతో ఈ పనులను వేగవంతం చేశారు. అదనపు ప్లాంట్ల నిర్మాణం పూర్తి కావటంతో కొద్దిరోజుల నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. సక్సెస్ కాగానే మరో వారం, పది రోజుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగించనున్నారు. ఈ పీఎస్ఏ అదనపు ఆక్సిజన్ ప్లాంట్లలో ఒక్కో ప్లాంటు సామర్థ్యం నిమిషానికి 1,000 లీటర్లు. ఇవి అందుబాటులోకి వస్తే ఎంజీఎం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తలెత్తకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎంజీఎం ఆస్పత్రిలో 250 పడకలకు మాత్రమే ఆక్సిజన్ వసతి ఉండేది. ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య 800కు పెరిగింది. ఇక నుంచి వాటన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం ఉండనుంది. ఈ ఆస్పత్రిలో వెంటిలెటర్ల సంఖ్య కూడా పెరిగింది. గతంలో 40 వెంటిలెటర్లు ఉండేవి. అదనంగా ప్రభుత్వం ఇటీవల మరో వంద కేటాయించింది.
త్వరలో అదనపు వైద్యుల నియామకం
ప్రభుత్వం ఎంజీఎం దవాఖానలో వైద్యసేవల ను విస్తృతం చేస్తున్నది. వైద్యులు, సిబ్బంది కొరతపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇటీవల 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించింది. తాజాగా మరో 72 మంది సీనియర్ రెసిడెన్స్ డాక్టర్లను ఏడాది కోసం తాత్కాలికంగా నియమించే ప్రక్రియ జరుగుతున్నది. ఎండీ పూర్తిచేసిన 72 మంది డాక్టర్ల నియామకం మరో వారం, పది రోజుల్లో పూర్తి కానుంది. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా రెండు అదనపు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ పనులు పూర్తయ్యాయి. ఈ రెండూ మరో పది రోజుల్లో వినియోగంలోకి రానున్నాయి. గతంలో 250 పడకలకు ఆక్సిజన్ వసతి ఉండేది. ఇప్పుడు 800 పడకలకు ఉంది. 1,050 బెడ్స్ కరోనా కోసమే కేటాయించాం. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎంలో సోమవారం వరకు ఆరుగురు కరోనా పేషెంట్లు ఉండగా, మంగళవారం కొత్తగా మరో షేషెంటు జాయిన్ అయ్యారు. మొత్తం ఏడుగురు పేషెంట్లు కరోనా చికిత్సపొందుతున్నారు. ముఖ్యం గా కరోనాకు అన్నిరకాల మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం. – బి.శ్రీనివాసరావు,
సూపరింటెండెంట్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి