వరంగల్,జూన్ 25 : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో గురువారం నుంచి భద్రకాళీ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ డాక్టర్ శివసుబ్రమణ్యం, ఈవో శేషు భారతి తెలిపారు. బుధవారం భద్రకాళీ అలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 26 నుంచి జూలై 10 వరకు 15 రోజుల పాటు కనులపండువగా అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.
మొదటి రోజు భద్రకాళీ అమ్మవారికి సహస్ర కలశాభిషేకం, నిత్య యాగంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అలాగే ఆషాఢ పౌర్ణమి రోజైన జూలై 10న భద్రకాళీ అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నామని, ప్రతి రోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అర్చకులు భద్రకాళీ శేషు, ధర్మకర్తలు అనంతుల శ్రీనివాస్‌రావు, ఓరుగంటి పూర్ణచందర్, నార్ల సుగుణ, మోతుకూరి మయూరి, పాలడుగు ఆంజనేయులు, తోనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జారతి వెంకటేశ్వర్లు, ముఖ్య అర్చకులు పార్నంది నర్సింహమూర్తి, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయకుమార్, సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.