హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 14: నానో యూరియాతో సత్ఫలితాలు పొందవచ్చని, ఖర్చు తగ్గి, అధిక దిగుబడి, భూసార పరిరక్షణ, పర్యావరణ హితమని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) కె.అనురాధ వివరించారు. హనుమకొండలోని ప్రెసిడెంట్ దాబాలో ఇఫ్కో ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ, నానో కాపర్, నానో జింక్పై వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల సహకార సంఘాలకు, ఆగ్రోస్, డీసీఎంఎస్, డీలర్స్, అభ్యుదయ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
శాస్త్రవేత్త రావుల ఉమారెడ్డి మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొదటిసారిగా యూరియాని ద్రవరూపంలో తీసుకొచ్చిన ఘనత ఓ భారతీయుడని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. అనురాధ మాట్లాడుతూ సంప్రాదాయ యూరియాను తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ అధికంగా వాడాలని ఆమె సూచించారు. ఇస్కో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. నానో ఎరువుల్లోకూ పరిమాణం చాలా చిన్నగా ఉండి ఆకులపై పిచికారి చేయడానికి వీలుగా ఉండి పత్ర రంధ్రాల ద్వారా శోషించబడుతుందన్నారు. నానో మూరియాలో నత్రజని 20 శాతం ఉంటుందని, నానో డీఏపీలో నత్రజని 8 శాతం, భాస్వరం 16 శాతం ఉంటుందని ఇవి రెండు ఎకరానికి 500 ఎంఎల్ చొప్పున పిచికారి చేయాలని, వీటిని అన్నిరకాల పంటలపై పిచికారి చేయవచ్చని తద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.
వరంగల్ మార్కెటింగ్ మేనేజర్ విశాల్ షిండే మాట్లాడుతూ నానో ఎరువులు అనేవి వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాకత పెంచుతాయని, వాటి నాణ్యత మెరుగుపరుస్తుందని, నేల ఆరోగ్యాన్ని పెంచి, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందని, నానో ఎరువులు వాడడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం 80-90 శాతం వరకు పెరుగుతుందన్నారు. ఇఫ్కో కిసాన్ డోకెన్స్, నానో మోడల్ విలేజ్, ఇతర ఇఫ్కో సేవల గురించి ఆయన వివరించారు. అన్నదాతకు ఆసరాగా సంకట్ హరణ్ భీమా యోజన అందిస్తున్నట్లు, ఈ పథకంలో భాగంగా రైతు ఇఫ్కో ఎరువులను గాని (బస్తాలు) నానో యూరియా, నానో ఓఏపీ గాని కొని దురదృష్టావశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి మరణించినట్లయితే, ఒక బస్తా కానీ ఒక బాటిల్కిగాని రూ.10,000 ఉచిత ప్రమాద బీమా, గరిష్ఠంగా 2 లక్షల వరకు వర్తిస్తుందన్నారు. ఇది రైతు కుటుంబాన్ని ఆపదలో ఆదుకుంటుందని విశాల్ షిండే వివరించారు.
ములుగు వి.సురేష్కూమార్, మహబూబాబాద్ జిల్లా డీఏవో విజయ నిర్మల, శాస్త్రవేత్తలు డీవై రావు గోపినాథ్ , డాక్టర్ రాములు, నర్సంపేట డివిజన్ ఏడీఏ కె.దామోదరరెడ్డి, వరంగల్ ఏడీ కె.రవీందర్రెడ్డి, ఏవో టెక్నికల్ కృష్ణారెడ్డి, వరంగల్, హనుమకొండ మార్క్ఫెడ్ డీఎంఎస్, వరంగల్ మార్కెటింగ్ మేనేజర్ విశాల్షిండే పాల్గొన్నారు.