సుబేదారి, జూన్ 28: ఎట్టకేలకు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్‌పై వేటు పడింది. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చే స్తూ శనివారం డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44మంది డీఎస్సీల బదిలీ కాగా, వారిలో నందిరాంనాయక్ ఉన్నారు. మొదటినుంచీ ఈయన పోలీసు శాఖ నిబంధనలు ఉల్లంఘించి, స్థానిక ఇన్స్పెక్టర్ల విధుల్లో జోక్యం చేసుకోవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓ మాజీ రౌడీషీటర్‌తో అంటకాగిన తీరుపై నమస్తే తెలంగాణలో వరుస కథనాలు వచ్చాయి.
వీటిపై అప్పటి సీపీ విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసినా అధికార పార్టీ ముఖ్య నేత జోక్యంతో మేనేజ్ చేసుకున్నాడు. ఇటీవల ప్రొటోకాల్ లేని కాంగ్రెస్ నేత కొండా మురళీకి ఎస్కార్ట్ డ్యూటీ చేయడంతో పాటు నలుగురు ఇన్స్పెక్టర్లను పురమాయించి ఎస్కార్ట్ డ్యూటీ చేయించడంపై నమస్తేలో కథనం రావడంతో ప్రస్తుత సీపీ సన్‌ప్రీత్‌సింగ్ స్పందించి ఏసీపీకి, ఇన్స్పెక్టర్లకు, ఎస్సైలకు చార్జీ మోమెలు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్ర ఇంటలిజన్స్ వర్గాలు ఆరా తీసి నివేదిక ఇవ్వడంతో ఏసీపీ నందిరాంనాయక్పై చర్యలకు ఉపక్రమించారు.