జనగామ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారం ఎట్టకేలకు డ్రా పద్ధతిలో ముగిసింది. బీఆర్ఎస్ విజయాన్ని నిలువరించేందుకు సో మవారం కాంగ్రెస్ అరాచకం సృష్టించి ఎన్నికను వా యిదా వేయించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రె స్ కౌన్సిల్ హాల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి కనుసన్నల్లో బీఆర్ఎస్ అభ్యర్ధికి మద్ధతుగా నిలిచిన దళిత మహిళ, స్వతంత్ర అభ్యర్ధి సందుపట్ల మంజులపై దాడికి తెగబడింది. ఆమె చేతిని రెండుసార్లు పైకెత్తగా బలవంతంగా దింపి ‘దాదాగిరీ’ చేసింది. ఈ దాష్టీకమంతా అధికార యంత్రాంగం కళ్లముందే కొనసాగింది.
అప్రజాస్వామికంగా జనగామ చైర్మన్ ఎన్నిక జరగడాన్ని నిరసిస్తూ, దాడి చేసిన కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల అధికారి, ఏసీపీ, ఎస్‌హెచ్‌వో, డీసీపీకి వేర్వేరుగా ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. భారీ బందోబస్తు నడుమ వాయిదా పడిన సమావేశాన్ని ప్రిసైడింగ్ అధికారి ప్రారంభించారు. మొదట కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్ధి కడకంచి బాలమణికి మద్దతుగా ఎంపీ ఓటుతో కలిపి 16 మంది చేతులెత్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగోని సుగుణాకర్కు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా సహా 16 మంది చేతులెత్తారు. అయితే పక్క గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్ సభ్యుడు చెంచారపు కరుణాకర్‌రెడ్డి ఒక్క ఉదుటన లేచి వచ్చి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా చేయి ఎత్తిన దళిత మహిళా స్వతం త్ర సభ్యురాలు సందుపట్ల మంజులపై దాడిచేసి ఆమె చేయిని బలవంతంగా దింపాడు. దీంతో ఆమె గట్టిగా అరిచి మళ్లీ చేయి పైకెత్తడంతో ఆమె వెనక స్వతంత్రుల గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్ మద్దతుదారుడు మారబోయిన పాండు రెండోసారి ఆమెపై దాడి చేసి చేయిని బలవంతంగా కిందకు దింపాడు.
ఆ వెంటనే మరో కాంగ్రెస్ సభ్యుడు పాముకుంట్ల ప్రసాద్ సైతం మహిళా సభ్యురాలిపై దాడికి యత్నించినా ఆమె ప్రతిఘటించి మరోసారి బీఆర్ఎస్కు మద్ధతుగా చేయి పైకెత్తింది. దీనిపై నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే పల్లాను ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వెనక నుంచి గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్లకుండా నిలువరించగా, జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్, ఇద్దరు సీఐలు ఆయన ముందు అడ్డుగా నిలిచారు. ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్టు చేసే వరకు కదిలేదీ లేదంటూ బీఆర్ఎస్ సభ్యులు కౌన్సిల్ హాల్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ గుండాయిజం నశించాలని, చైర్మన్ ఎన్నికను రద్దు చేయాలని ఎమ్మెల్యే నినాదాలు చేశారు.
దళిత మహిళపై దాడిచేసి చేతిని కిందకు దింపి అనుచితంగా వ్యవహరించిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లపై ప్రజాప్రతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకొని సభ్యత్వాలను రద్దు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధితురాలితో కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి మరో ఫిర్యాదును మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఏసీపీ, డీసీపీ, ఎస్‌హెచ్‌వోలకు వేర్వేరుగా అందజేశారు.
చైర్మన్ కోసం బీఆర్ఎస్ నుంచి గోపగోని సుగుణాకర్, కాంగ్రెస్ నుంచి కడకంచి బాలమణి (ఎక్స్ అఫీషియోతో కలిపి)కి 16 ఓట్లు రావడంతో డ్రా ద్వారా అధికారులు ఎన్నిక నిర్వహించారు. ఇందులో బాలమణి (కాంగ్రెస్)కు చైర్పర్సన్ పీఠం వరించింది. అలాగే వైస్ చైర్మన్‌కు బీఆర్ఎస్ నుంచి భూష పర్వతాలు, కాంగ్రెస్ నుంచి మారబోయిన పాండు కోసం డ్రా తీశారు. ఇందులో పర్వతాలు (బీఆర్ఎస్)కు వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గందరగోళం నడుమ అధికారులు చైర్పర్సన్, వైస్ చైర్మన్‌తో పదవీ ప్రమాణం చేయించారు.