వరంగల్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎరువుల అమ్మకాల్లో అధికారుల నిఘా, పర్యవేక్షణ పూర్తిగా కొరవడడం రైతులకు శాపంగా మారింది. ప్రధానంగా మార్కెట్లో యూరియా ధరకు రెక్కలొచ్చాయి. ఎమ్మార్పీ (గరిష్ఠ ధర) అమలు కావడం లేదు. ధర పెంచి విక్రయిస్తూ ఎరువుల డీలర్లు రైతుల జేబులను లూటీ చేస్తున్నారు. ఒక్కో యూరియా బస్తా (50 కిలోల)కు ఎమ్మార్పీ రూ.267 ఉంటే రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు.
యూరియా విక్రయాల్లో ఓపెన్‌గా ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతున్నా, నియంత్రించాల్సిన వ్యవసాయ శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఒక్కో యూరియా బస్తాకు ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.50 నుంచి రూ.80 వరకు రైతుల నుంచి గుంజుతున్నారు. నర్సంపేట, వర్ధన్నపేట వ్యవసాయ డివిజన్లలో ఇటీవలికాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల్లో వానకాలం వరి నాట్లు కొంత ఆలస్యం కావడంతో రైతులు ఇంకా కొద్ది రోజులపాటు యూరియాను వినియోగించే అవకాశం ఉంది.
యూరియాను ఎమ్మార్పీపై రైతులకు అందించాలని, అవసరమైన నిల్వలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా జిల్లాలకు కేటాయిస్తున్న యూరియా నిల్వల్లో 60 శాతం పీఏసీఎస్‌లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు (ఏఆర్ఎస్కే), ఓడీసీఎంఎస్, ఎఫ్ఎస్సీఎస్, రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవో), ఆర్ఎస్పీఎస్ఎస్, ఎఫ్‌పీసీఎల్, ఏరువాక రైతు సంఘం వంటి వాటికి, మిగిలిన 40 శాతం యూరియాను ఎరువుల డీలర్లకు కేటాయిస్తున్నది. మార్క్‌ఫెడ్ ద్వారా యూరియాను పొందుతున్న పీఏసీఎస్‌లు, ఓడీసీఎంఎస్, ఏఆర్ఎస్కేలు, ఎఫ్‌పీవోలు,
ఇతర సంఘాలు రైతులకు ఎమ్మార్పీ రూ. 267 చొప్పున ఒక్కో బస్తాను అమ్మకం జరపాల్సి ఉండగా, హమాలీ చార్జ్జీతో కలిపి రూ. 275 లెక్కన విక్రయిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇటీవల కలెక్టర్ సత్యశారద జిల్లాలో ఎరువులపై జరిగిన సమీక్షలో ప్రతి పీఏసీఎస్, ఓడీసీఎంఎస్, ఏఆర్ఎస్కేలు, ఎఫ్‌పీవోలు, ఇతర సంఘాల్లో రైతుల కోసం యూరియా అందుబాటులో ఉండాలని, ఆయా సంఘాల్లో కచ్చితంగా యూరియా స్టాక్ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె ఆదేశాలను అధికారులతోపాటు సంఘాల నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు.
దీంతో కొన్ని సంఘాల్లో యూరియా అందుబాటులో లేక రైతులకు దొరకడం లేదు. ఉదాహరణకు జిల్లాలో కొన్ని పీఏసీఎస్‌లు, ఇతర సంఘాల్లో ఒక్కో సంఘంలో ప్రస్తుత వానకాలం సీజన్లో వందల టన్నుల యూరియా సరఫరా జరిగితే కొద్దిరోజుల క్రితం వరకు ఖానాపురం, బుధరావుపేట ఓడీసీఎంఎస్లకు కేవలం 9.99 టన్నుల చొప్పున, నెక్కొండ ఎఫ్పీసీఎల్కు 11.97, వర్దన్నపేట మండలం నల్లబెల్లి పీఏసీఎస్, వరంగల్ పీఏసీఎస్, ఓడీసీఎంఎస్, పర్వతగిరి ఏఆర్ఎస్కేకు 19.98 టన్నుల చొప్పున యూరియా సరఫరా జరిగింది. ఖానాపురం ఏఆర్ఎస్కే, గీసుగొండ, విశ్వనాథపురం ఓడీసీఎంఎస్, మహ్మదాపురం ఓడీసీఎంఎస్, నర్సంపేట ఏఆర్ఎస్కే-2, చింతలపల్లి పీఏసీఎస్లదీ ఇదే పరిస్థితి. సంఘాల్లో స్టాక్ లేకపోవడంతో మార్కెట్లో డీలర్ల వద్ద ఎమ్మార్పీ కంటే అదనంగా డబ్బు చెల్లించి యూరియా కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు తెలిపారు.
పీఏసీఎస్‌లు, ఓడీసీఎంఎస్లు, ఏఆర్ఎస్కే, ఇతర సంఘాల్లో కొన్ని యూరియా నిల్వలను అందుబాటులో పెట్టకపోతుండగా మరికొన్ని వ్యవసాయ శాఖ తమకు కేటాయించిన యూరియా నిల్వల్లో కొన్నింటిని లాభాలపై ఎరువుల డీలర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. మార్క్‌ఫెడ్ నుంచి వచ్చిన యూరియా నిల్వల్లో కొన్నింటిని తమ గోదాములకు, మరికొన్నింటిని ఎరువుల డీలర్ల గోదాములకు తరలిస్తున్నట్లు సమాచారం. తద్వారా టన్ను లెక్కన అవగాహన మేరకు ఆర్థికంగా లబ్ధిపొందుతున్నట్లు తెలిసింది. కొన్ని పీఏసీఎస్‌లు, ఏఆర్ఎస్కేలతోపాటు ఇతర సంఘాల్లోనూ ఇదే జరుగుతున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ అక్రమ దందాకు వ్యవసాయశాఖలోని కొంద రు అధికారుల సహకారం ఉందనే ఆరోపణలున్నాయి. ఇటీవల చెన్నారావుపేట పీఏసీఎస్ పరిధిలోని పాపయ్యపేట బ్రాంచ్ నుంచి సేల్స్‌మెన్ ఎం శ్రీనివాస్ స్థానిక రైతుల పేర్లను నమోదు చేసి 74 యూరియా బస్తాలను పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానికి అమ్మగా ట్రాన్స్‌పోర్టు విషయంలో వాహనాల యజమానుల మధ్య తలెత్తిన వివాదం వల్ల బయటపడింది. విచారణలో రుజువు కావడంతో జిల్లా సహకార అధికారి పాపయ్యపేట బ్రాంచ్ సేల్స్‌మెన్ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో జిల్లాలో సంఘాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.