వరంగల్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభకు జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి హాజరయ్యారు.
వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ లను ప్రారంభించారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గ్రామంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి దిశగా పయనిస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, అధికారులు సమష్టి కృషితో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.