నెల్లికుదురు ఏప్రిల్ 21 : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లికుదురు -మహబూబాబాద్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ మునిగలవీడు గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే రక్షిత మంచినీటి బావి మోటరు కాలిపోయి వారం రోజులు అవుతున్నది. అధికారులు మాత్రం మరమ్మతులు చేపించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు.
గ్రామపంచాయతీలో రూపాయి కూడా లేదని మీరు మరమ్మతులు చేయించుకోండి బిల్లు వచ్చాక మీకు చెల్లిస్తామని నిర్లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శి సమాధానమిస్తున్నాడని ఆరోపించారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని అధికారులను డిమాండ్ చేశారు. ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పండి. పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులను శాంతింపజేసి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, దేవేందర్, నాగన్న, సుధాకర్, శ్రీశైలం, వెంకన్న, ప్రవీణ్, శేఖర్, వీరస్వామి, రాము, తదితరులు పాల్గొన్నారు.