తొర్రూరు, జనవరి28: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో మంగళవారం గ్రామస్తులు పాఠశాలకు వచ్చి 8, 9 వ తరగతి విద్యార్థినులతో రహస్యంగా మాట్లాడారు. ఇద్దరు ఉపాధ్యాయులు మానసికంగా వేధించడమే కాక, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఆటలు ఆడిస్తున్నారని విద్యార్థినులు చెప్పడంతో ఉపాధ్యాయులను నిలదీశారు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతూ ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా మెలగాలని హెచ్ఎం వెంకటేశ్వర్రావుతో పత్రం రాయించుకున్నారు. కాగా, ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు పాఠశాలకు వచ్చిన రోజే 16 మంది ఉపాధ్యాయుల్లో ఆరుగురు గైర్హాజరవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఆరోపణలు నిజమైతే చర్యలు
ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు నిజమైతే చర్యలు ఉంటాయి. వారిపై విచారణ చేయడానికి జిల్లా విద్యాధికారి నుంచి అనుమతులు తీసుకుంటాం. ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చి విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటారు.
– బుచ్చయ్య, మండల విద్యాధికారి