నర్సింహులపేట, జూన్ 19 : అనుమతుల పేరుతో చెరువు మట్టి అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మట్టి రవాణా మూడు పువ్వులు, ఆరుకాయలుగా కొనసాగుతోంది. వందల ట్రిప్పులకు అనుమతి తీసుకుని వేల ట్రిప్పుల్లో చెరువు మట్టిని ఇటుక బట్టీకి జేసీబీతో బుధవారం రాత్రి తరలిస్తుండగా రైతులు గొడవకు దిగినట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నర్సింహులపేట మండలం పెద్ద నాగారంలోని ముత్యాలమ్మ చెరువు మట్టి అక్రమ తరలింపుపై కలెక్టర్ దృష్టి సారించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
చెరువును కాపాడాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి అక్రమ అనుమతులు ఇచ్చి చెరువులను చెరబడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు, కుంటలో ఇష్టా రాజ్యంగా మట్టి తోలడంతో పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి వేల ట్రాక్టర్లతో చెరువు మట్టిని అనధికారికంగా విక్రయిస్తున్న అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.