ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావంతో.. వంటింట్లో గ్యాస్ సెగ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధర పెంచేసింది. ధరాఘాతాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నా.. గ్యాస్ కొరత కోరలు చాస్తున్నది. సిలిండర్ బుక్ చేసి పది రోజులు దాటుతున్నా గ్యాస్ బండ జాడ కనిపించడం లేదు. ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నా.. సిలిండర్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్‌ను వీలైనంత ఆదా చేయడం మాత్రమే మన చేతుల్లో ఉన్నది. మీ ఇంట్లో సిలిండర్ ఎక్కువ కాలం వచ్చేలా ఈ చిట్కాలు పాటించండి.
ప్రెజర్ కుకింగ్: సంప్రదాయ వంట పద్ధతులతో పోలిస్తే.. ప్రెజర్ కుకింగ్ వంట సమయంతోపాటు ఇంధనాన్ని సైతం ఆదా చేస్తుంది. ప్రెజర్ కుకింగ్ వల్ల బియ్యంపై 20 శాతం, నానబెట్టిన పప్పులపై 46 శాతం, కూరగాయలపై 50-70 శాతం, మాంసంపై 41.5 శాతం గ్యాస్ ఆదా అవుతుందని పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వెల్లడించింది.
తకువ వేడిలో: మంట ఎకువగా ఉన్నప్పుడు గ్యాస్ వేడి రూపంలో వృథా అవుతుంది. పాన్ ఉపరితలం నుంచి వెలువడే అధిక వేడి చుట్టుపకల గాలిని గ్రహిస్తుంది. అలా కాకుండా పదార్థం మరిగే సమయంలో వేడిని తగ్గించడం వల్ల 25 శాతం వరకు గ్యాస్ ఆదా చేయవచ్చు.
ముందు నానబెట్టండి: పప్పులు, బియ్యం, ఇతర ధాన్యాలను ముందే నానబెట్టడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. పదార్థాలు అప్పటికే నీటిని పీల్చుకుని ఉన్నందున, వంట సమయంలో ఆవిరైపోయే నీటి పరిమాణం తగ్గుతుంది. నానబెట్టడం వల్ల గ్యాస్ ఆదా కావడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
వెడల్పాటి కుండలలో: బర్నర్ నుంచి వచ్చే మంట కుండ ఉపరితలంపై కేంద్రీకృతమై ఉంటుంది. వెడల్పాటి కుండలో వంట చేయడం వల్ల ఉష్ణశక్తి వృథాను అరికట్టవచ్చు. గ్యాస్‌ను ఆదా చేయడమే కాకుండా త్వరగా వంట చేయడానికి కూడా ఈ కుండలు సాయపడతాయి.
చిన్న బర్నర్ వాడండి: పెద్ద బర్నర్లకంటే చిన్నవి 6-10 శాతం తకువ గ్యాస్ ఉపయోగిస్తాయి. దీని వ్యాసార్థంతో చుట్టుపకల ప్రాంతానికి తకువ వేడి బదిలీ కావడంతో గ్యాస్ వినియోగం కొంత తగ్గుతుంది.
మూత వాడండి: మీ వంట పాత్రలపై మూత పెట్టడం వల్ల లోపలున్న వేడి కారణంగా ఆహారం వేగంగా తకువ గ్యాస్‌తోనే ఉడుకుతుంది.
వాటిని శుభ్రం చేయండి: బర్నర్లపై మసి పేరుకుపోవడం వల్ల మూసుకుపోయి వంట ఎకువసేపు అవుతుంది. వంట పూర్తయ్యాక బర్నర్లను శుభ్రం చేయడం మర్చిపోకండి.
ఎలక్ట్రిక్ వాడకం: అన్నం వండుకోవడం, గుడ్లు ఉడికించేందుకు ఎలక్ట్రిక్ పరికరాలను వాడుకోవచ్చు.