బయ్యారం, సెప్టెంబర్ 14: సార్లు వచ్చా రు.. సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. స్వయంగా మంత్రి సీతక్క హామీ ఇచ్చినా అధికారులు మాత్రం సమస్య వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నెల 1న మహబూబాబాద్ జిల్లాలో వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. 2న బయ్యారం మండలంలోని అల్లిగూడెం శివారులోని పందిపంపుల వాగును మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు.
ఈ క్రమంలో అక్కడి ప్రజలు వాగుపై నిర్మించిన బ్రిడ్జి పిల్లర్లు దగ్గరగా వేయడంతో వరద సమయంలో కర్రలు, చెత్త బ్రిడ్జి కింది భాగంలో చిక్కుకొని నీటి ప్రవాహానికి అడ్డు తగులుతుందని, దీంతో గ్రామంలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్అండ్బీ అధికారులకు చెప్పామని, రేపు మధ్యాహ్నం వరకు చెత్తను తొలగిస్తారని, లేని పక్షంలో ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పాలని ఎంపీ బలరాంనాయక్ తెలిపారు. అయితే పది రోజులు గడుస్తున్నా ఇంత వరకు బ్రిడ్జి కింద ఉన్న కర్రలు, చెత్తను అధికారులు తొలగించకపోవడంతో గ్రామ ప్రజలు మంత్రి, ఎంపీ హామీ ఇచ్చినా పని జరగలేదంటూ అధికారుల తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.