హనుమకొండ, నవంబర్ 17: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో 300 మంది శివభక్తులకు రుద్ర అధ్యాయంలో సామూహిక రుద్రాభిషేకం నిర్వర్తించి రుద్రునికి 51 కిలోల పెరుగు అన్నంతో అన్నసూక్త మంత్రపఠనంతో వేదోక్తంగా మహాఅన్నపూజ నిర్వహించారు. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి అభిననొద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో ప్రొటోకాల్‌ను అనుసరించి పూర్ణకుంభ స్వాగతం పలికి వారికి ఉత్తిష్ఠగణపతి దర్శనం కల్పించి రుద్రేశ్వరస్వామి వారికి స్వామిజీ స్వయంగా రుద్రపారాయణంలో పంచామృతాభిషేకం నిర్వర్తించుకున్నారు.
అనంతరం దేవాలయ నాట్యమండపంలో వేలాది మంది భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. స్వామివారిని ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ భక్తులకు స్వామివారిని పరిచయం చేశారు. స్వామివారి వెంట శృంగేరి శారదాపీఠం ఆస్థాన ప్రచారకుడు మరమాముల వెంకటరమణశర్మ, మణీదీప్శర్మ, శ్రీచరణ్శర్మ సంస్కృత పండితులు హైగ్రీవ్శర్మ, వేద పండితులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ఆలయ సిబ్బంది ఎన్.మధుకర్, రజితా ,రామకృష్ణ భక్తులకు సేవలందించారు. సాయంత్రం భజనలు, చతుర్వేద పారాయణంలు, ప్రదోషకాల రుద్రాభిషేకాలు నిర్వర్తించారు. మంగళవారం మాస శివరాత్రిని పురస్కరించుకొని రుద్రునికి రుద్రాభిషేకం, ఆలయ ప్రాంగణంలో రుద్రేశ్వరీ-రుద్రేశ్వరుల కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.