హనుమకొండ, జూన్ 3: హనుమకొండ అంబేద్కర్‌నగర్‌లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన వాటిని తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాళాలు పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్లారు. అక్కడే వంట చేసుకుని, చాపలు వేసుకొని పడుకొన్నారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ప్రభుత్వం 2015లోనే అంబేద్కర్‌నగర్‌లో 53 మందికి, జితేందర్ నగర్లో 64 మందికి కలిపి మొత్తం 117 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు.
ప్రొసీడింగ్ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా గుడిసెల్లో చెత్త డింపింగ్ యార్డు పక్కన ఉంటున్నామని, దుర్వాసన, దోమలతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక ఎమ్మెల్యే అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు డబుల్ బెడ్రూం ప్రాంతానికి చేరుకొని బాధితులతో మాట్లాడినా వినకుండా అధికారులు, ఎమ్మెల్యే వచ్చే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకొని కూర్చున్నారు.
రాత్రి వరకు కూడా అధికారులు, ఎమ్మెల్యే రాకపోవడంతో అక్కడే ఉన్నారు. డబుల్‌బెడ్ రూంలు అప్పగించే వరకు ధర్నాను విరమింప చేయమని, బుధవారం నుంచి మరింత ఉధృతం చేస్తామని బాధితులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్, జితేందర్‌సింగ్ నగర్‌కు చెందిన సౌరం రఘు, ఎర్ర చంద్రమౌళి, ఓరుగంటి స్వామి, కొయ్యడ కృష్ణ, దరికి రమేశ్, బొచ్చు సరోజన, మోర శిల్ప, వంటేరు కిరీటతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.