హనుమకొండ, జూన్ 5 : హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాల్సిందేనని రెండు రోజులుగా బాధితులు చేపట్టిన ఆందోళన గురువారం కూడా కొనసాగింది. తమకు కేటాయించిన ఇళ్లను పంపిణీ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని బైఠాయించారు. ఈ క్రమంలో అక్కడికి హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి, ఆర్ఐ దశరథరాంరెడ్డితో పాటు పోలీసు అధికారులు చేరుకొని అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు.
ఇందుకు సంబంధించిన జాబితా సిద్ధం చేశామని, ఎమ్మెల్యే అనారోగ్య కారణంతో ఆలస్యమవుతున్నదని, త్వరలోనే సర్వే ఆధారంగా ఎంపిక చేసిన లిస్టును ఎమ్మెల్యేకు చూపించి కలెక్టర్ అనుమతితో ఇండ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. పదేండ్ల నుంచి ఇలాగే చెపుతున్నారని, ప్రభుత్వాలు, తహసీల్దార్లు మారినా తమకు ఇండ్లు ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ‘తాము ఇక్కడే ఉంటాం..
మా గుడిసెలు కూలిపోయాయి.. మళ్లీ వాటిని సర్దాలంటే రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. అవసరమైతే రోడ్డుపైనే ఉంటాం. ఇండ్లలోకి వెళ్లం’ అని చెప్పారు. వారితో కొద్దిసేపు చర్చలు జరిపి 15 నుంచి 20 రోజుల మధ్య సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి హామీ ఇవ్వడంతో తాత్కాలింగా ఆందోళన విరమిస్తున్నట్లు బాధితులు తెలిపారు. గడువు తర్వాత కూడా ఇండ్లు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు.